ఒక రోజు ముందే...సామాజిక పెన్షన్ల పంపిణీ
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్ల విషయంలో చరిత్ర సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక పెన్షన్లను భారీగా పెంచింది. కేవలం పెంచడమే కాదు..ప్రతి నెల ఒకటవ తేదీన వారి ఇళ్ల వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి నెలలోనే వారికి గతంలో హామీ ఇచ్చినట్లు ఏడు వేల రూపాయలను పెన్షన్‌ను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంచిపెట్టారు. ఇది దేశంలోనే అరుదైన విషయం. ఒక ముఖ్యమంత్రి సామాజిక పింఛన్లు అందచేయడం నిజంగా చెప్పుకోదగిన విషయమే. కాగా..సెప్టెంబర్ లో ఇవ్వాల్సిన సామాజిక పెన్షన్లను ఈసారి కూటమి ప్రభుత్వం ఒక రోజు ముందుగానే..అంటే ఈనెల 31వ తేదీనే ఇవ్వబోతోంది. ప్రతి నెలా ఒకటవ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను ఈ నెలలోనే అంటే (శనివారం, ఆగస్టు 31న) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31వ తేదీన సామాజిక పెన్షన్ తీసుకోని వారికి తరువాత పింఛన్ అందిస్తారు. ఏ కారణం చేతనైనా 31వ తేదీన పెన్షన్లు తీసుకోకపోతే సెప్టెంబర్2వ తేదీన అంటే సోమవారం రోజున పింఛన్లు అందచేస్తారు. గత జగన్ ప్రభుత్వం సామాజిక ఫించన్ల పంపిణీని వాలంటీర్లతో చేయించింది. వారంతా ఇంటింటికి వెళ్లి పించన్లు అందచేశారు. అయితే..కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు అందచేస్తుంది. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు రావని జగన్ పార్టీ అప్పట్లో ప్రచారం చేసింది. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నించి విఫలమైంది. మొత్తం మీద..రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా..చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ, ఉద్యోగుల జీతాలను ఒకటవ తేదీ లేకపోతే..అంతకు ముందు రోజే ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. గతంలో ఉద్యోగుల జీతాలు ఎప్పుడు వస్తాయో..ఎంత మందికి వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఉద్యోగుల జీతాలు 1వ తేదీనే పడుతున్నాయి.