టిడిపి ఎదురుదాడితో బిత్తరపోయిన వైకాపా...!
స్కిల్ కేసులో చంద్రబాబును నాటకీయపరిణామాల మధ్య అరెస్టు చేసిన తరువాత టిడిపి బలహీనపడుతుందని, ఆ పార్టీలో నైతికస్థైర్యం దెబ్బతింటుందని, టిడిపి నాయకులు, కార్యకర్తలు పోరాడలేరని వైకాపా పెద్దలు అంచనా వేశారు. అయితే..వారు ఊహించిన దానికి భిన్నంగా టిడిపి కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు అధికారపార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అయి దాదాపు నెలరోజులు కావస్తున్నా టిడిపి ఎక్కడా తగ్గకుండా వివిధ మార్గాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తోంది. చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత రోజు టిడిపి బంద్‌కు పిలుపునిస్తే ప్రజలే స్వచ్ఛంధంగా బంద్ నిర్వహించారు. తరువాత ఐటీ ఉద్యోగులు, సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు, వివిధ వర్గాల వారు చంద్రబాబు అక్రమ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో కోర్టుల్లో టిడిపికి ఉపశమనం లభించకపోయినా టిడిపి నేతలు, కార్యకర్తలు నిరాశ చెందలేదు. ఏదో విధంగా చంద్రబాబు నేరం చేశాడని నిరూపించేందుకు, అధికారపార్టీ పలుమార్గాల్లో ప్రయత్నిస్తోంది. మొదట్లో చంద్రబాబు తప్పు చేశారని వందలో పది శాతమో, 20శాతమో నమ్మేవారు. అయితే..ఆయన అరెస్టు అయి నెలరోజులకు పైగా అయినా, ఆయన అవినీతి చేశాడనే దానికి రుజువులను అధికారపార్టీ చూపించలేకపోతోంది. నేరుగా చంద్రబాబుకు సొమ్ములు అందినాయా..? అన్న ప్రశ్న ఇప్పుడు అధికారపార్టీ పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కోర్టుల్లోనూ ఇదే ప్రశ్న అధికారపార్టీ న్యాయవాదులకు ఎదురవుతోంది. స్కిల్ కుంభకోణమంటూ ఒకటే ఊదరగొడుతున్న అధికారపార్టీ, దానికి వంతపాడే కొంతమంది జర్నలిస్టులు ఇప్పుడు దీనిపై డొంక తిరిగుడు సమాధానాలు చెబుతున్నారు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు చూపమంటే..ఏమి చెప్పాలో తెలియక చివరకు టిడిపి పార్టీకి వచ్చిన నిధులను అడ్వకేట్ జనరల్ చూపిస్తున్నారు. స్కిల్ కేసులో వచ్చిన సొమ్ములు టిడిపి పార్టీకి చేరాయని ఆయన కోర్టులో వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ వాదననే వైకాపా నమ్ముకుంది. ఆ పార్టీని సమర్థించే జర్నలిస్టులు రూ.27కోట్లు టిడిపి పార్టీకి వచ్చాయని, అవన్నీ స్కిల్ సొమ్ములని వాదిస్తున్నారు. అయితే..ఈ వాదనను ప్రతిపక్ష టిడిపి పార్టీ బలంగా తిప్పికొట్టింది. తమ పార్టీకి విరాళాలు వచ్చాయని, అన్ని పార్టీలకు అలా విరాళాలు వస్తాయని, తమకు కేవలం రూ.27కోట్లు మాత్రమే వచ్చాయని, అదే అధికార వైకాపాకు దాదాపు రూ.600కోట్లు వచ్చాయని రుజువులతో చూపించడంతో వైకాపా నేతలు బిత్తర చూపులు చూస్తున్నారు. కేవలం వైకాపాకే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కూడా విరాళాలు వచ్చాయని, ఇలా విరాళాలు రావడం చట్టపరంగా సరైనదేనన్న ఎదురు వాదనతో వైకాపాకు టిడిపి గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ విషయంలో ఎలా బయటపడాలో..తెలియక..చంద్రబాబుకు అవినీతి మరక అంటించలేకపోయామన్న బాధ వైకాపా నేతల్లో కనిపిస్తోంది. ఆయనను అరెస్టు చేయడమే తప్పునుకుంటుంటే..ఇప్పుడు పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి కింద లెక్క కట్టాలన్న వైకాపా పెద్దల వ్యూహం బూమరాంగైంది. తమ పార్టీకి వచ్చిన విరాళాలు, టిడిపికి వచ్చిన విరాళాలను లెక్కలు వేసి మరీ టిడిపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. పార్టీ విరాళాల విషయంలో టిడిపి చేసిన ఎదురుదాడితో వైకాపా బిత్తరపోతోంది. ఇదెక్కడి గోలరా..బాబూ..అనవసరంగా ఇరుక్కుపోయాం..అనే భావన అధికార పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. అయితే కొంత మంది సిగ్గు విడిచి ఇంకా చంద్రబాబుపై విషప్రచారం చేస్తూనే ఉన్నారు. జర్నలిస్టులమని చెప్పుకునే ఎర్నలిస్టుల పని ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందమైంది.