లేటెస్ట్

I&PRలో అవుట్‌సోర్సింగ్ కుంభ‌కోణం...!

రూ.3కోట్లు లంచాలు బొక్కిన అధికార‌గ‌ణం...
ఒక్కో ఉద్యోగి ద‌గ్గ‌ర రూ.ల‌క్ష‌నుంచి రూ.4ల‌క్ష‌లు వ‌సూలు
అక్ర‌మాల‌ను వెల్ల‌డిస్తోన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు..!
జ‌గ‌న్ మార్కు దోపిడీ...! నిర్ధారించిన విజిలెన్స్‌...!
మాకేం తెలియ‌దు..అంతా విజ‌య్‌కుమార్‌రెడ్డే...!
జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్ర స‌మాచార‌శాఖ కార్యాల‌యం అవినీతికి,అక్ర‌మాల‌కు, అనైతిక కార్య‌క్ర‌మాల‌కు నిల‌యంగా మారింది. జ‌గ‌న్ కుంటుంబానికి దోచిపెట్ట‌డానికే క‌మీష‌న‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్‌కుమార్‌రెడ్డి ఆయ‌న సిబ్బంది..దోపిడీలోజ‌గ‌న్ వాటా పోను మిగ‌తాది వంతుల వారీగా వాటాలేసుకుని దింగ‌మింగార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌క‌ట‌న‌ల జారీలో, అవుట్‌డోర్ యాడ్స్‌లో, సీసీ టీవీల్లోనూ అడ్డ‌గోలుగా దోచుకున్న విజ‌య్‌కుమార్‌రెడ్డి బృందం చివ‌ర‌కు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామ‌కంలో కూడా భారీగా వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌మాచార‌శాఖ ద్వారా దాదాపు 300 మందిని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌ను భ‌ర్తీ చేశారు. ఈ ఉద్యోగాల‌ను జ‌గ‌న్ పార్టీకి చెందిన వారికే ఇచ్చారు. అయితే..వారికేమీ ఊరికే ఇవ్వ‌లేదు. ఒక్కోఉద్యోగానికి ఇంత‌ని వ‌సూలు చేశారు. త‌క్కువ‌లో త‌క్కువ రూ.1ల‌క్ష‌కు త‌క్కువ కాకుండా అమ్మేసుకున్నార‌ట‌. కొంత మంది వ‌ద్ద ల‌క్ష నుండి నాలుగు ల‌క్ష‌ల దాకా వ‌సూలు చేశార‌ని, అప్ప‌ట్లో ఈ ఉద్యోగాల‌ను కొనుగోలు చేసిన వారు ఇప్పుడు చెబుతున్నారు. త‌మ నుంచి ల‌క్ష‌లు దండుకున్నార‌ని, రాష్ట్ర స‌చివాల‌యంలో ప‌నిచేసిన ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బ‌హిరంగ‌గానే చెబుతున్నారు. త‌మ‌కేమీ ఊరికే ఉద్యోగం ఇవ్వ‌లేద‌ని, త‌మ వ‌ద్ద భారీ మొత్తాల‌ను వ‌సూలు చేశార‌ని వారు ఇప్పుడు చెబుతున్నారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు ఇష్టారీతిన జీతాలు ఇచ్చింది. ఒక ఫోటోగ్రాఫ‌ర్‌కు దాదాపు రూ.ల‌క్ష‌న్న‌ర జీతం ఇచ్చింది. ఎటువంటి సాంకేతిక నైపుణ్యం లేక‌పోయినా..వారిలో ఎటువంటి నైపుణ్యాలు లేక‌పోయినా..వారి వ‌ద్ద నుండి వ‌సూలు చేసిన సొమ్ముల‌ను బ‌ట్టి జీతాల‌ను నిర్ధారించారు.  
వ‌సూళ్ల కింగెవ‌రు...?
కాగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామ‌కంలో భారీగా లంచాలు గుంజిందెవ‌రు..? అప్ప‌ట్లో క‌మీష‌న‌ర్ విజ‌య్‌కుమార్ రెడ్డిని గుప్పెట్లో పెట్టుకుని ఆడించిన అధికారే..దీనిలో ప్ర‌ధాన పాత్ర పోషించార‌నే అభియోగాలు ఉన్నాయి. విజ‌య్‌కుమార్‌రెడ్డిది నామ‌మాత్ర వ్య‌వ‌హారం అని, అంతా ఆ అధికారే చేశార‌ని శాఖ‌లోని ఉద్యోగులు చెబుతున్నారు. విజిలెన్స్ విచార‌ణ జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో ఇప్పుడు శాఖ‌లో ఇది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామ‌కంలో భారీగా సొమ్ములు చేతులు మారాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై కొంద‌రు సీనియ‌ర్ అధికారుల‌కు విజిలెన్స్ నోటీసులు జారీ చేసింద‌నే మాట శాఖ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై మ‌రింత విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది.
ఉన్న‌తాధికారుల ఆస్తుల‌పై విచార‌ణ...!
కాగా గ‌త ఐదేళ్ల‌లో శాఖ‌ను గుప్పెట్లో పెట్టుకుని పెత్త‌నం చేసిన ప‌లువురు అధికారుల ఆస్తుల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని శాఖ‌లోని ఇత‌రు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వారి ఆస్తులెంత‌..? ఇప్పుడెంత‌..? అనేదానిపై విచార‌ణ జ‌రిపించాల‌ని, వారి ఆస్తులు ఎంత మొత్తంలో పెరిగాయో విచార‌ణ జ‌రిగితే తేలుతుందంటున్నారు. శాఖ‌ను గుప్పెట్లో పెట్టుకున్న అధికారి, వారి కుటుంబ స‌భ్యులు గ‌తంలో విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో తిరిగేవార‌ని, ఇప్పుడు మాత్రం విమానాల్లో ప్ర‌యాణిస్తున్నార‌ని, ఒక్క‌సారిగా ఇంత విలాస‌వంత‌మైన జీవితం ఎలా జీవించ‌గ‌లుగుతున్నార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అక్ర‌మ‌మార్గంలో సంపాదించిన సొమ్ముతోనే ఇది సాధ్య‌మైంద‌ని వారు చెబుతున్నారు. వీరి ఆస్తులపై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపిస్తే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయంటున్నారు.
సెల‌వుపై పంపాలి...!
కాగా శాఖ‌లో అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికారుల‌ను సెల‌వుపై పంపాల‌ని జ‌ర్న‌లిస్టు వ‌ర్గాలు కోరుతున్నాయి. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన అధికారుల‌ను బ‌దిలీ చేస్తార‌ని స‌చివాల‌య వ‌ర్గాలు అంటున్నాయి. అయితే..వారిని బ‌దిలీ చేయ‌వ‌ద్ద‌ని, వారిని సెల‌వుపై పంపి వారి అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని, రాష్ట్ర స‌మాచార‌శాఖ మంత్రి పార్థ‌సార‌ధిని వారు కోరుతున్నారు. అసెంబ్లీలో ఆయ‌న స‌భ్యుల‌కు హామీ ఇచ్చార‌ని, అవినీతి, అక్ర‌మాల‌పై నిగ్గుతేలుస్తామ‌ని చెప్పార‌ని, అయితే..ఇంత వ‌ర‌కూ ఆయ‌న దీనిపై సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకున్న దాఖలాలు లేవ‌ని, ఇప్ప‌టికైనా..ఆయ‌న చ‌ర్య‌ల కోసం ఉప‌క్ర‌మించాల‌ని వారు కోరుతున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ