మోపిదేవి..స్థానం..టిడిపిలో దక్కేదెవరికి...!?
వైకాపా రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైకాపాతో పాటు, తన రాజ్యసభ స్థానానికి నేడు రాజీనామా చేశారు. జగన్‌తో సరిపోకనే తాను రాజీనామా చేశానని,, తాను రాజకీయాల్లోనే ఉంటానని, టిడిపిలోకి వెళతానని ఆయన స్పష్టంగా ప్రకటించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, స్థానికంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మీడియాతో చెప్పారు. టిడిపి పెద్దలతో ఆయన ఇప్పటికే మాట్లాడుకున్నారని, స్థానికంగా ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారని, తద్వరా ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ సీటులో టిడిపికి చెందిన వారితోభర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రాధమికంగా ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని, తరువాత మంత్రి పదవి ఇస్తారని టిడిపి వర్గాలు అంటున్నాయి. అయితే..ఇప్పటికిప్పుడు ఆయనకు మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు. పైగా ఆయన తాను స్థానికంగా ఉంటానని చెబుతున్నారు. ఆయన స్వంత స్థానమైన రేపల్లెలో టిడిపికి గట్టి నాయకత్వం ఉంది. ఇక్కడ నుంచి వరుసగా మూడుసార్లు అనగాని సత్యప్రసాద్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన కీలకమైన రెవిన్యూశాఖను చూస్తున్నారు. ఒక వేళ మోపిదేవిని ఎమ్మెల్సీని చేసినా మంత్రి పదవి మాత్రం రావు. అయితే..ఇప్పుడు కాకపోయినా..వచ్చే ఎన్నికల నాటికైనా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని మోపిదేవి వర్గీయులు అంచనా వేస్తున్నారు. అయితే..ఇది అంత తేలిక కాదని, 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. పునర్విభజనలో మోపిదేవి రేపల్లె నుండి కాకుండా నూతనంగా ఏర్పడే..నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఆ ఎన్నికల్లో టిడిపి, మోపిదేవి గెలిస్తేనే..ఆయనకు మంత్రి పదవి ఖాయంగా వస్తుందనే భావన కొన్ని వర్గాల్లో ఉంది. కాగా ప్రస్తుతానికి ఆయన రాజ్యసభ వదులుకున్నందును ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఖచ్చితంగా ఇస్తారు.
టిడిపి లక్కీ నేత ఎవరు..?
మోపిదేవి రాజ్యసభకు రాజీనామాతో..ఆయన స్థానం ఖచ్చితంగా టిడిపికి దక్కుతుంది. రాజ్యసభకు ఉప ఎన్నికలు జరిగితే..టిడిపి ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని గెలుచుకుంటుంది. కాగా అప్పుడు టిడిపి అభ్యర్థి ఎవరనే దానిపై టిడిపిలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేదు. మోపిదేవి రాజీనామా తరువాత...ఆ స్థానంలో టిడిపి అభ్యర్థి వస్తారు. అయితే..ఇలా వచ్చే లక్కీ నేత ఎవరు..? కొన్ని అంచనాల ప్రకారం గుంటూరు మాజీ ఎంపి గల్లాజయదేవ్ పేరు వినిపిస్తోంది. ఆయన ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు. తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని చెప్పారంటున్నారు. గతంలో గల్లజయదేవ్ లోక్‌సభలో పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించారు. మిస్టర్ ప్రైమ్ మినస్టర్ అంటూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిప్పులు చెరిగారు. అయితే..అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తరువాత ఆయనకు నష్టాన్ని చేకూర్చాయి. తనను ఢిల్లీ పాలకులు లక్ష్యంగా చేసుకున్నారని, తాను ప్రస్తుతానికి రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించి మొన్నటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా కేంద్రంలో టిడిపి మద్దతుతోనే బిజెపి ప్రభుత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఆయన అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. గల్లాకు రాజ్యసభ ఇవ్వడానికి చంద్రబాబుకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఆయన కాకుండా మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఆశిస్తున్నారు. అయితే..బీసీ సామాజికవర్గానికి చెందిన మోపిదేవి రాజీనామా చేశారు కనుక..అదే వర్గానికి ఈ సీటుఇవ్వాలనే డిమాండ్ బీసీ వర్గాల నుంచి వస్తోంది. వీరు కాకుండా ఎస్సీ ఉద్యమకారుడొకరు రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా మోపిదేవితో పాటు రాజీనామా చేసిన బీద మస్తాన్‌రావును మళ్లీ రాజ్యసభకు పంపుతారు కనుక..ఆయన బీసీ సామాజికవర్గానికి చెందిన వారే అవడంతో..రెండో సీటును చంద్రబాబు సామాజికవర్గానికే కేటాయించే అవకాశం ఉంది. మొత్తం మీద..టిడిపిలో ఇప్పుడు రాజ్యసభ సందడి నెలకొంది. మోపిదేవి స్థానంలో వచ్చే లక్కీ నేత ఎవరే ఉత్కంఠత పార్టీ వర్గాల్లో మరికొన్ని రోజుల పాటు ఉండనుంది.