ఉదాశీనత వల్లే సమస్యలు...!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో తాను చేసిన పొరపాట్ల గురించి ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు. గతంలో నేరస్తుల పట్ల ఉదాశీనత ప్రదర్శించానని, దాని వల్లే ఇప్పుడు మళ్లీ కొందరు చెలరేగిపోతున్నారని చెబుతున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అనుమానితుల విషయంలో ఉదాశీనత ప్రదర్శించానని, దాంతో వారు తనపైనే నిందలు వేశారని, అప్పుడే వారందరినీ బొక్కలో వేసి ఉంటే వేరేగా ఉండేదని, కానీ తాను ఉదాశీనతతో వ్యవహరించడం వల్ల, ఆ హత్యను తన మెడకు చుట్టాలని వారు ప్రయత్నించారని, ఈసారి అలా ఉండదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. గతంలో వలే..ఇప్పుడూ నేరస్తులు చెలరేగిపోతున్నారని, ఆడ బిడ్డలపై విష ప్రచారాలను చేస్తున్నారని, ఇలా చేసేవారి పట్ల కఠినంగా ఉంటామని ఆయన తెలిపారు. అయితే..ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికలను సైకో ముఠా లెక్కచేస్తుందా...? ఆయన అంతేలే...? ఆయన చర్యలు తీసుకో లేరు....భయపడతారని, తమనెవరూ ఏమీ చేయలేరనే భావనతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాలు ముఖ్యమంత్రి ఆయన కుమారుడి దృష్టికి వెళుతున్నాయో..లేదో కానీ..మరీ అరాచకంగా, సైకోతనంతో వ్యవహరిస్తున్నారు. వీరి సైకోయిజానికి జర్నలిజం ముసుగేసుకున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టారాజ్యంగా తిప్పుతున్నాయి.
గుడ్లవల్లేరు కాలేజీపై యూట్యూబ్ ఛానెల్స్ సైకోయిజం...!
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వ్యవహారంలో ఒక యూట్యూబ్ ఛానెల్ అరాచకంగా వ్యవహరించింది. ఈ యూట్యూబ్ ఛానెల్ నిర్వహకుడు గుడ్లవల్లేరు కాలేజీ వ్యవహారంలో 300 వీడియోస్ ఉన్నాయని అందరికంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించాడు. తన ప్రతినిధిని అక్కడకు పంపానని, అక్కడ వీడియోస్ రికార్డు చేశారని ఘంటాపథంగా చెప్పేశాడు. తాను చెప్పిందే నిజమన్నట్లు..అక్కడేదో జరిగిందని హోరెత్తించాడు. ఇతను పైకి టిడిపి అనుకూలంగా ఉన్నట్లు వ్యవహరిస్తూనే ఆ పార్టీకి, ప్రభుత్వానికి చేయాల్సిన నష్టం చేస్తూనే ఉన్నాడు. వ్యూస్ కోసం అతను..ముందూ వెనుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. వ్యూస్ ద్వార సొమ్ములుచేసుకునేందుకు..ఐదు నిమిషాలు నిడివి కలిగిన వీడియోలు యధేచ్ఛగా వదిలేస్తున్నాడు. ఇతనికి తోడు..టిడిపిని నిత్యం వ్యతిరేకించే మరి కొన్ని ఛానెల్స్ కూడా దీనికి వంత పాడాయి. ఒక సున్నితమైన విషయంలో పోలీసుల విచారణ జరగక ముందే పెదరాయుడిలా తీర్పులు ఇవ్వడం ఏమిటి..? సున్నితమైన విషయాల్లో ఎలా వ్యవహరించాలో..తెలియదా..? అసలు విషయం తెలిసిన తరువాత నింపాదిగా సారీ చెప్పేస్తే పోతుందా..? ఎందుకు అంత వ్యూస్ కక్కుర్తి. లక్షలు పోగేసుకున్నా..ఇంకా సొమ్ములు కావాలనే యావలో ఏదిపడితే..అది చెప్పేసి..మహిళల ఉసురెందుకు తీసుకుంటారు..? ఇలాంటి వారిపై ముందు చర్యలు తీసుకోవాల్సి ఉంది. తరువాత..ఊరికో సైకోను తయారు చేసిన పెద్ద సైకోను బొక్కలోకి నెట్టాలి. మొత్తం మీద..ఇలా విష ప్రచారం చేసేవారిపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదాశీనత లేకుండా వ్యవహరిస్తారని ఆశిద్దాం.