అర్థరాత్రి కూడా ఆగని చంద్రబాబు పర్యటనలు...!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలోని వరదబాధితుల కోసం అర్థరాత్రి కూడా పర్యటనలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు. బోట్‌లలో ప్రయాణిస్తూ వరదబాధిలను పరామర్శిస్తూ వారికి అవసరమైన ఆహారాన్ని, తాగునీటిని అందించే పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఉదయం నుంచి సహాయక చర్యలు చేపడుతున్నా..బాధితులు భారీగా ఉండడంతో..వారిని నివాసప్రాంతాలకు తరలించడం, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి టీమ్ తీవ్రంగా కృషిచేస్తోంది. ఉదయం ఒకసారి ముఖ్యమంత్రి స్వయంగా బోట్‌లో వెళ్లి వరదబాధితులను పరామర్శించారు. ఒకసారి వారిని పరామర్శించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్లకుండా..అక్కడే ఉండి వరదబాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. చిట్టచివరి బాధితుడిని కూడా ఆదుకునే తాను అక్కడ నుంచి వెళతానని, ఎవరూ భయాందోళన చెందనవసరం లేదని ఆయన చెప్పారు. అర్థరాత్రి తరువాత ఆయన మరోసారి బోట్‌లో ప్రయాణించి బాధితులను కలుస్తున్నారు. వారికి అందుతున్న సేవల గురించి ఆయన అడుగుతూ స్వయంగా ఆయనే వారికి సహాయం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కురిసిన వర్షాలకు విజయవాడ నీటమునిగిపోయింది. ఒకవైపు వరద సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొంటూనే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ, ప్రధాని మోడీతోనూ వరద సహాయక చర్యల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. తాము చేపడుతున్న సహాయక చర్యలను ఆయన మీడియాకు రెండుసార్లు వివరించారు. 75 ఏళ్ల చంద్రబాబు ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ స్వయంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనడం విశేషం. ముఖ్యమంత్రి చర్యల వల్ల వరద బాధితులకు ఉపశమనం లభిస్తోంది. తమను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం వారిలో నెలకొంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారిని ఆదుకునేందుకు, వారికి అవసరమైన సహాయక చర్యలున తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగడంతో అధికారయంత్రాంగం ఆగమేఘాలపై వరదసహాయక పనులను చేస్తోంది.