జగన్‌పై జత్వాస్త్రాన్ని సంధించిన షర్మిల...!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని ఆయన సోదరి వై.ఎస్.షర్మిల అంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడపలో ఆయన పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమైన షర్మిల, రాబోయే రోజుల్లోనూ ఆయనను రకరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు దొరికిన ఏ అవకాశాన్ని ఆమె వదులుకోవడం లేదు. తనను తన సోదరుడు మోసగించారనే కారణంతోనే..ఆమె జగన్‌ను నానా తిప్పలు పెడుతున్నారు. తాజాగా ముంబాయి సినీనటి కాదంబరీ జత్వాని విషయంలో జగన్ ప్రమేయంపై తేల్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కడపకు వెళ్లిన ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ..జగన్..జిందాల్‌లు ఇద్దరూ కలిసే ముంబాయి సినీనటి కాదంబరిని హింసించారని, ఆమెపై లేనిపోని కేసులు కుట్రపూరితంగా పెట్టి ఆమెను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కడపలో జిందాల్ కనీసం రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, జగన్‌కు మాత్రం లంచాలు ఇచ్చి..సినీనటిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. జగన్‌కూ ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఇద్దరు ఆడబిడ్డల తండ్రి సినిమాల్లో ఎదుగుదామని వచ్చిన అమాయక ఆడపిల్లను హింసిస్తారా..? అని ఆమె ప్రశ్నించారు. జత్వానీ వ్యవహారంలో జగన్ సమాధానం చెప్పాలని, ఆమెపై కేసు జగన్‌కు తెలియకుండా జరగదని, దీనిపై జగన్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ వద్ద పనిచేసిన ఐఏఎస్, ఐపిఎస్‌లతో పాటు జగన్ కూడా దీనికి సమాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన కోసం నెలలపాటు పాదయాత్ర చేసిన షర్మిలకు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మోసం చేశారనే బాధ ఉంది. రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోయినా..సర్దుకుపోయిన షర్మిల తండ్రి సంపాదించిన ఆస్తులు జగన్ ఇవ్వకపోవడంపై సోదరుడిపై ఆగ్రహాన్ని పెంచుకున్నారు. తనను తన సోదరుడు మోసం చేశారని, ఆయన రాజకీయంగా బలంగా ఉండడంతోనే..తనను పట్టించుకోవడం లేదని, రాజకీయంగా సోదరుడిని తుంచేస్తే..అప్పుడు ఆయన దారికి వచ్చి తన ఆస్తి తనకు ఇస్తారనే భావన ఆమెలో ఉంది. అందుకే..దొరికిన ఏ అవకాశాన్ని ఆమె వదులుకోదలచుకోలేదు. తాజాగా ముంబాయి నటి జత్వానీ విషయంలో నేరుగా జగన్‌కు తాకే విధంగా విమర్శలు ఎక్కుపెట్టారు. పైగా ఆయన కుమార్తెలను కూడా దీనిలోకి తీసుకువచ్చారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్, ఒక సినీనటి విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తారా..? అనేదాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లి తన సోదరుడు ఎంత దుర్మార్గుడో..మరోసారి ప్రజలకు వివరించబోతున్నారు. మొత్తం మీద జగన్ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా..షర్మిల సోదరుడిని క్షమించడం లేదు. ఆయన రాజకీయపతనానికి ఇటుకాఇటుక పేర్చుకుంటూ వస్తున్నారు. మరి ఈ విషయంలో ఆమె విజయం సాధిస్తారో..లేదో చూడాల్సి ఉంది.