చంద్రబాబు చుట్టూ కొత్త కుట్రలు...!
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు తరువాత ఆయనను, ఆయన పార్టీ దెబ్బ తీసేందుకు ఆయన వ్యతిరేకులు కొత్త కొత్త కుట్రలకు తెరతీస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే స్కిల్ స్కామ్ అంటూ చంద్రబాబును అరెస్టు చేసి దాదాపు నెల రోజుల నుంచి జైలులో పెట్టి ఆనందిస్తున్న మూక ఇప్పుడో కొత్త కుట్రకు తెరతీసింది. తనపై పెట్టిన కేసు అక్రమమని, దాన్ని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంలో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ విచారణకు రాకుండా సరికొత్త డ్రామాను సృష్టించడానికి రంగం సిద్ధం చేశారు. అదేమంటే...ఇప్పటికే చంద్రబాబు కేసులో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేటప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే..చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అటువంటిదేమీ లేకుండా నేరుగా అరెస్టు చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏసీబీ,హైకోర్టుల్లో ప్రస్తావించి, గట్టిగా ప్రశ్నించారు. అయితే..ఆయా కోర్టులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆయనను రిమాండ్‌కు పంపాయి. దీనిపై చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. అక్టోబర్ 3వ తేదీన ఈ కేసు సుప్రీంలో విచారణ జరిగింది. సెక్షన్ 17ఎ చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన లాయర్లు సుప్రీం దృష్టికీ తీసుకువచ్చారు. వాళ్ల వాదనను సుప్రీం దాదాపుగా సమర్థించింది. అయితే..17ఏ చంద్రబాబుకు వర్తించదని, 2017 ముందే ఈ కేసు పెట్టామని ప్రభుత్వ తరుపు న్యాయవాదులు చెప్పడంతో దానికి సంబంధించి పత్రాలను కోర్టు ముందు ఉంచాలని సుప్రీం ఆదేశించి 9వ తేదీకి కేసును వాయిదా వేసింది. వాస్తవానికి 2017లో చంద్రబాబుపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. దీంతో సోమవారం కేసు విచారణ జరిగితే చంద్రబాబుకు అనుకూలంగా కేసులో తీర్పు వస్తుందనే భయంతో ఇప్పుడు చంద్రబాబుపై కొత్త కుట్రలకు తెరలేపారు.
సెక్షన్ 17ఏ రద్దుకు కుట్ర...!
అదే మంటే చంద్రబాబుకు చట్టపరంగా రక్షణ కల్పించే సెక్షన్17ఏను రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషన్‌తో సుప్రీంలో కేసు వేయించారు. సెక్షన్17ఏ దుర్వినియోగం అవుతుందని, దీని వల్ల తప్పు చేసిన రాజకీయనాయకులు తప్పించుకుంటున్నారని దీన్ని రద్దు చేయాలని వైకాపాను ఆరాధించే ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషన్ కేసును దాఖలు చేశారు. ఇప్పుడు ఇంత అర్జంట్‌గా ఈ కేసును ఎందుకు దాఖలు చేశారంటే..చంద్రబాబుకు 17ఏ నుంచి రక్షణ రాకుండా చేసేందుకే కేసు వేశారనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు దీనిపై తీర్పు రాకుండా కేసును ఇంకా నాన బెట్టేందుకు..చంద్రబాబును మరికొన్ని రోజులు జైలులో ఉంచే లక్ష్యంతోనే ఈ కేసును ఇప్పుడు దాఖలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెక్షన్ 17ఏను రద్దు చేయాలని వేసిన కేసులో ఇప్పటికే కొంత వరకు వాదనలు సాగాయి. ఈ కేసును వచ్చే నెల 20వ తేదీకి సుప్రీం వాయిదా వేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు కేసులో కూడా సెక్షన్17ఏనే కీలకం కనుక ఆ కేసు తేలే వరకు చంద్రబాబు కేసును కూడా సుప్రీం పక్కన పెట్టాలని ప్రభుత్వ న్యాయవాదులు వాదించబోతున్నారు. సెక్షన్ 17ఏ రద్దు విషయం తేలేవరకు, చంద్రబాబు కేసును కూడా పక్కన పెట్టాలంటున్నారు. ఒక వేళ వారి వాదనలను సుప్రీం అంగీకరిస్తే చంద్రబాబు కేసు అప్పటి వరకూ వాయిదా పడుతూనే ఉంటుంది. అది ఇప్పట్లో తేలదు కనుక అప్పటి దాకా చంద్రబాబు కేసు తేలదు. చంద్రబాబును మరిన్ని ఇబ్బందులకు గురిచేసేందుకే ఇప్పుడు సెక్షన్17ఏ రద్దు చేయాలనే కుట్రను ఢిల్లీ సాక్షిగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందా..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైకాపాను భుజానమోసే ప్రశాంత భూషన్ ఈ కేసు దాఖలు చేసినందువల్ల, వైకాపా, ఢిల్లీ పెద్దలు కలిసే కొత్త కుట్రకు తెరతీశారనే అనుమానాలు టిడిపిలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద సోమవారం నాడు చంద్రబాబు కేసులో ఏదో ఒకటి తేలుతుందన్న భావన ఉన్నపరిస్థితుల్లో ఇప్పుడు మరో కుట్ర, కుతంత్రాలు జరగబోతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.