బెంగుళూరులో జగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం...!
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారట. ఆయనకు అత్యంత సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన మాజీ సిఎం అయినప్పటి నుంచి బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టిపెట్టినట్లు వారు చెబుతున్నారు. ఆయన ప్రతిసారి తాడేపల్లి నుంచి బెంగుళూరు వెళ్లేది దీని కోసమేనని వారు అంటున్నారు. ఈ వర్గాలు చెబుతోన్న సమాచారం ప్రకారం జగన్ వచ్చే మూడు నాలుగేళ్లూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని, ఎన్నికలకు ఏడాది ముందుగానీ, లేక అంతకు ముందు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారట. అప్పటికి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతుందని, తాను గత ఐదేళ్లలో చేసిన పాపాలను కూడా ప్రజలు మరిచిపోతారనేది ఆయన ఉద్దేశ్యమట. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జగన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారట. ఓటమి నైరాశ్యాన్ని పోగొట్టుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి పెట్టారట. సహజంగానే మంచి వ్యాపారవేత్త అయిన జగన్ ఈ రంగంలో బాగా రాణిస్తారని ఆయన సహచరులు, అభిమానులు చెబుతుంటారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే బెంగుళూరు నుంచి తాడేపల్లికి నెలలో ఒకటి రెండు రోజులు వచ్చేసి, కూటమి ప్రభుత్వంపై బురదజల్లేసి దర్జాగా మళ్లీ బెంగుళూరు వెళ్లిపోతారట. ఈలోగా తన సాక్షి మీడియా, ఇతర కొనుగోలు చేసిన మీడియా, సోషల్‌మీడియాతో చంద్రబాబు ప్రభుత్వంపై నిత్యం బురదజల్లేపని ఆపకుండా చేయిస్తారట. 2014లో చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లే మళ్లీ మరింత విషం చల్లి ప్రచారం చేయించాలని ఆయన నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. దానిలో భాగంగానే మళ్లీ రాజధాని అమరావతి మునిగిపోతుందనే ప్రచారాన్ని విస్తృతంగా చేయిస్తున్నారు. అదే సమయంలో కులాలను, మతాలను రెచ్చగొట్టే వ్యూహంలో ఉన్నారని సమాచారం. మొత్తం మీద మాజీ అయిన తరువాత జగన్ గతంలో చేసిన వ్యాపారాలను తిరిగి మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.