మంత్రుల్లో నెం.1 రామానాయుడు...!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా వందరోజులు. ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి,ప్రజలకు వచ్చిన కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. 75ఏళ్ల వయస్సులో కూడా ఆయన అవిశ్రాంతంగా కష్టపడుతున్నారు. ఆయన పనితీరు గురించి కొత్తగా చెప్పుకోవలిసింది ఏమీ లేదు. ఆయనో పనిరాక్షసుడు. నిత్యం పని..పనీ..అదే ఆయన తీరు. విజయవాడ వరద నేపథ్యంలో ఆయన పనితీరు ఏమిటో..ఇప్పటి తరానికి స్పష్టంగా అర్థం అయి ఉంటుంది. గత ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి ఎంత తేడా ఉందో రాష్ట్ర ప్రజలు గ్రహించగలిగారు. ప్రజలకు ఆపదవస్తే చంద్రబాబు ఎలా స్పందిస్తారో..జగన్ ఎలా స్పందిస్తారో..వారికి సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. అయితే..ఇప్పటి ప్రభుత్వంలో కేవలం ముఖ్యమంత్రే కాదు..ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఎలా పనిచేస్తారో..రాష్ట్రం చూస్తోంది. గతంలో జగన్ వద్ద మంత్రులుగా ఉన్నవారు..బూతులు తిట్టడానికి, హేళనలు చేయడానికి, సరసాలు ఆడడానికే పరిమితమయ్యేవారు. అలా కాకపోతే..అవినీతి, అక్రమాలకు, అరాచాలకు పాల్పడేవారు. అయితే ఇప్పుడున్న మంత్రుల్లో మెజార్టీ మంత్రులు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఆయనతో పాటు పరిగెత్తుతున్నారు. వంద రోజుల ఎన్‌డిఏ కూటమి పాలన తరువాత..వారి పనితీరుపై ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ముఖ్యంగా మంత్రుల పనితీరుపై రాజకీయవర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ చర్చల్లో చంద్రబాబు తరువాత అత్యధిక మార్కులు పొందుతోంది రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి రామానాయుడు. ఆయన పనితీరు చూసి రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోతోంది. ఒక మంత్రి ఇలా పనిచేస్తారా..? మంత్రి అంటే రాజభోగాలు అనుభవిస్తారు కానీ..క్షేత్రస్థాయిలో కాల్వగట్లపై రాత్రింభవళ్లు ఉండి పనిచేస్తారా..? అసలు రాజకీయనేతల్లో ఇలాంటివారు ఉంటారా..? అంటూ ఆయన గురించి ఆరా తీస్తున్నారు. ఎవరీ రామానాయుడు..అంటూ..? విజయవాడను వరద చుట్టుముట్టడానికి కారణమైన బుడమేరువాగుకు పడ్డ గండ్లను పూడ్చివేయడానికి ఆయన దాదాపు వారం రోజుల పాటు ఆ గట్లపైనే నిద్రించారు. విడవకుండా వర్షం పడుతున్నా..చలివేస్తున్నా..అక్కడే..ఆహారం, నిద్ర..ఇలా సర్వం గట్లపైనే..ఒక మంత్రి ప్రజల కోసం ఇంత నిబద్దతతో పనిచేస్తారా..? అంటూ చివరకు ఇండియన్ ఆర్మీ కూడా ఆశ్చర్యపోయింది. వాస్తవానికి రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే రీతిలో పనిచేశారు. అప్పట్లో ఆయన పనితీరు గురించి ఆయన నియోజకవర్గంలోనే తెలుసు. కానీ నేడు..ఆయన పనితీరును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇక ఆయన తరువాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. తన శాఖకు సంబంధించిన పలు విషయాలపై ఆగమేఘాలపై స్పందిస్తున్నారు. ఎంతో క్లిష్టమైన విద్యాశాఖలో సంస్కరణలు తేవడానికి ఆయన తీవ్ర కృషి చేస్తున్నారు. పంచాయితీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ పంచాయితీల విషయంలో తనదైన శైలిలో పనిచేస్తున్నారు. పంచాయితీలకు స్వంత నిధులను ఖర్చు చేస్తున్నారు. ఆయనతో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తనదైనశైలిలో వ్యవహరిస్తున్నారు. ఇక కీలకమైన మున్సిపల్‌శాఖలో సీనియర్ మంత్రి నారాయణ అమరావతిపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన హోంశాఖ మంత్రి అనిత ఫర్వాలేదనిపిస్తున్నారు. రెవిన్యూశాఖ మంత్రి అనగాని, దేవాదాయశాఖ ఆనం రాంనారాయణరెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి, సోషల్‌వెల్ఫేర్ డోలా వీరాంజనేయస్వామి, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్,వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు, ఐ&పిఆర్ మంత్రి కొలుసు పార్థసారధి, టూరిజంఖా మంత్రి దుర్గేష్, మహళా సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, రోడ్లు,భవనాలశాఖ మంత్రి జనార్థన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, కార్మికశాఖ మంత్రి సుభాష్, మైక్రోశాఖ మంత్రి కె.శ్రీనివాస్, రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డిలు ఇంకా పనిలో పడలేదు. వారికిచ్చిన శాఖలపై వారు పట్టుసాధించడానికి యత్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే..మంత్రుల్లో రామానాయుడు, లోకేష్, పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నారాయణలు దూసుకుపోతున్నారు. మిగతావారి ఇంకా తమదైన ముద్ర వేయలేదు.