వైకాపా అధికార ప్రతినిధులుగా రోజా, జూపూడి...!
వైకాపా అధికార ప్రతినిధులుగా మాజీ మంత్రి ఆరె.కె.రోజాతో పాటు మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావులను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నియమించారు. వీరితో పాటు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆర్.శ్యామలను కూడా అధికారప్రతినిధులుగా నియమించారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి ఆర్.కె. రోజా పార్టీని వీడిపోతారని, ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రోజా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై విరుచుకుపడుతుంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు రోజా వీరిపై అడ్డగోలుగా విమర్శలు చేసింది. ముఖ్యంగా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను వ్యక్తిగతంగా తూలనాడింది. అయితే..వైకాపా ఘోర పరాజయం తరువాత ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే..ఆమె ఇటీవలే విజయవాడలో వచ్చిన వరదలపై వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చారు. వైకాపా రాజకీయాల్లో ఆమె మళ్లీ క్రియాశీలకం కావడంతో..ఆమెను అధికార ప్రతినిధిగా జగన్ నియమించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా మేధావిగా పేరున్న జూపూడి ప్రభాకర్‌రావును ఎస్సీ సెల్ నుంచి తొలగించి అధికారప్రతినిధిగా నియమించారు. ఎస్సీల్లో ముఖ్యంగా మాలల్లో గట్టిపట్టున్న జూపూడిని అధికారప్రతినిధిగా జగన్ నియమించి..ఆ వర్గానికి పార్టీలో సముచిత స్థానం కల్పించారు. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడైన జూపూడి తొందరపాటు నిర్ణయాలతో రాజకీయజీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. మాలసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ప్రస్థానం మొదలై తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూపూడికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఆయన మరణం తరువాత జూపూడి రాజకీయజీవితం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. వై.ఎస్ మరణం తరువాత మంత్రి పదవి ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఆహ్వానించినా..ఆయన వై.ఎస్.కుటుంబానికి వీరవిధేయుడిగానే ఉన్నారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూపూడిని ప్రకాశం జిల్లాలోని సీనియర్ నేతలు పట్టుపట్టి ఓడించడంతో..ఆయన మనస్థాపం చెంది టిడిపిలో చేరారు. అయితే..అక్కడ నుంచి మళ్లీ వైకాపాలో చేరినా..ఆయనకు పెద్దగా ఒరింగిందేమీ లేదు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక సలహాదారు పదవి ఇచ్చి..ఐదేళ్లు అరవచాకిరి చేయించుకున్నారు. అయితే..2024 ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమి తరువాత పార్టీలోపేరుమోసిన నాయకులంతా తలోదారి పరారవుతుండడంతో..జూపూడికి మళ్లీ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. నోరున్ననేతగా, సబ్జెట్ తెలిసినవాడు అవడంతో.. అధికారప్రతినిధిగా ఆయన రాణిస్తారనే భావన పార్టీలో ఉంది. ఆయనకు తోడుగా రోజా, కరుణాకర్‌రెడ్డి, శ్యామలలు ఉండటంతో పార్టీ వాయిస్ ప్రజలకు గట్టిగా వినిపిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.