సోషల్ మీడియా ఒత్తిడితోనే ముగ్గురు ఐపిఎస్‌లపై వేటు...!
కాదంబరీ జత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సీనియర్ ఐపిఎస్ అధికారులు పీఎస్ ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముంబయ నటి కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన కేసులు వీరు ముగ్గురు కీలక నిందితులుగా ఉన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరు ఆ నటిని వేధించారని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో కదలిక వచ్చింది. అప్పట్లో తనపై పోలీసులు చేసిన దౌష్టన్యం గురించి కాదంబరి నూతన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పలు కీలక విషయాలను రాబట్టారు. ఈ కేసులో ఆమె పట్ల పోలీసులు అరాచకంగా వ్యవహరించినట్లు, కేసు నమోదుకు ముందే ముంబాయికు ప్టైట్ టిక్కెట్ బుక్‌చేసుకున్నట్లు ఆధారాలతో దొరికిపోయారు. దీంతో వీరిపై చర్యలు ఉంటాయని చాలా రోజుల నుంచి చర్చసాగుతోంది. అయితే..ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు ఈ సీనియర్ ఐపిఎస్ అధికారులపై చర్యలు తీసుకోరని, ఆయన తత్వానికి ఇది విరుద్ధమని, కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని వీరిని వదిలేస్తారని చాలా మంది ఆశించారు. చివరికి టిడిపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా చంద్రబాబు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటారని అనుకోలేదు. దాదాపు రెండు నెలల నుంచి ఈ కేసు నానుతున్నా ప్రభుత్వం వైపు నుంచి సీరియస్ ఆర్డర్స్ రాకపోవడంతో..వీరిని వదిలేస్తారని భావించారు. అయితే..టిడిపి సోషల్‌మీడియా, తటస్థులు, మేధావులు వీరిపై చర్యలకు గట్టిగా డిమాండ్‌చేశారు. ముఖ్యంగా టిడిపికి మద్దతు పలికే సోషల్‌మీడియా చంద్రబాబును, లోకేష్‌ను, పవన్‌కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకుని మెతక రాజకీయాలు చేస్తున్నారని, ఇలా అయితే..పార్టీ దెబ్బతింటుందని గట్టిగానే డిమాండ్ చేశారు. ఒకవైపు గతంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డ వైకాపా నాయకులను వదిలేస్తున్నారని, వారిని కనీసం అరెస్టు చేయడం లేదని, మరోవైపు వైకాపా అంటకాగిన పోలీసు అధికారులపై చర్యలు లేవని చంద్రబాబును, ఆయన తనయుడిపై విమర్శలు గుప్పించారు. పార్టీ నాయకుల్లోనూ, టీవీ చర్చల్లో టిడిపి తరుపున పాల్గొనే నాయకులు కూడా దీనిపై సంతృప్తికరమైన సమాధానాలు చెప్పుకోలేకపోతుండడంతో, అన్ని వైపుల నుంచి వస్తోన్న ఒత్తిడితో చివరకు వీరిపై చర్యలకు చంద్రబాబు సిద్ధపడ్డారు. కాగా వీరిపై సస్పెండ్ వేటు వేసిన తరువాత వీరిని అరెస్టు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. మొత్తం మీద..సోషల్ మీడియా ఒత్తిడితోనే వీరిపై చర్యలు తీసుకున్నారనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతోంది.