ఐఏఎస్‌లను వదిలేసి..ఐపిఎస్‌లపైనే చర్యలా...!?
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముగ్గురు ఐపిఎస్ అధికారులపై వేటు వేయడం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒకేసారి ముగ్గురు సీనియర్ ఐపిఎస్‌లపై సస్పెండ్ వేటువేయడం బహుఅరుదు. అయితే..వీరు ముగ్గురు ఒక సినీనటిపై అన్యాయంగా కేసులు మోపి, ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారనే ఆరోపణలు వచ్చాయి. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఈ ముగ్గురు ఐపిఎస్‌లు తమకు ఉన్న అధికారాన్ని విచ్చలవిడిగా వాడి..సినీనటి జత్వానీతో పాటు ఆమె కుటుంబసభ్యులను వేధించారని ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. దీనితో..వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత జగన్ ప్రభుత్వంలో ఆయన అండ చూసుకుని పలువురు ఐపిఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. అలా చెలరేగిపోయిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే..అప్పట్లో ఐపిఎస్‌లతో సమానంగా కొందరు ఐఏఎస్‌లు కూడా జగన్‌కు బానిసల్లా వ్యవహరించారు. అలా వ్యవహరించిన ఏ అధికారిపై కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. వారిలో కొందరు రిటైర్డ్ అయితే..వారిని గౌరవంగా సాగనంపింది. అయితే..అప్పట్లో జగన్ అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రాజకీయ, అధికార, మేధావి వర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. వాళ్లకు..అలా..వీళ్లకు ఇలా..ఏమిటి..? అవినీతి, అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరినీ ప్రభుత్వం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, ఐఏఎస్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జవహర్‌రెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. సామాజిక ఫింఛన్ల విషయంలో ఆయన అప్పటి ఆపధర్మ ప్రభుత్వం చెప్పినట్లు చేయడం, పింఛన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా..మండుటెండలో వయోవృద్ధులను, వికలాంగులను నడిపించడంతో దాదాపు 60 నుంచి 70 మంది వరకు చనిపోయారు. ఈ మరణాలకు అప్పటి సిఎస్‌ను ఖచ్చితంగా బాధ్యుడిని చేయాల్సిందే. అప్పటి ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్‌రెడ్డి జగన్ కుంభకోణాలకు, అవినీతికి ప్రధాన కారకుడు. ఆయనతో పాటు అప్పట్లో ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అజేయకల్లంపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈయన కూడా పలు అవినీతి దందాలకు, అక్రమాలకు నిలయంగా మారారు. అదే విధంగా ఇసుక కుంభకోణాలకు మూలకారకుడైన ద్వివేది, గిరజాశంకర్‌లపై కూడా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖలో అనేక అక్రమాలకు, అవినీతికి కారకుడైన ప్రవీణ్ ప్రకాష్‌ను వదిలేశారు. అదే విధంగా ఆర్థికశాఖలో అనేక అక్రమాలకు కారకుడైన రావత్‌ను వదిలేశారు. అదే శాఖకు చెందిన సత్యనారాయణను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆయనపై చర్యలు లేవు. మరోవైపు పూనం మాలకొండయ్య, మున్సిపల్‌శాఖను చూసిన శ్రీలక్ష్మిలను కూడా చూసీ చూడనట్లు వదిలేశారు. సీనియర్ ఐఏఎస్ లు అనంతరాము, మురళీధర్‌రెడ్డిలు జగన్‌కు బానిసల్లా పనిచేశారు. వారిపై కూడా ఎటువంటి చర్యలు లేవు. అప్పట్లో సిఎంఓలో పనిచేసిన రేవు మత్యాలరాజు అవినీతి, అక్రమాలను విచారించాలి. కృష్ణాజిల్లా జెసిగా పనిచేసి తరువాత తూర్పుగోదావరి కలెక్టర్‌గా పనిచేసిన మాధవీలత అవినీతి భాగోతాలను కథకథలుగా చెప్పుకుంటారు. కానీ..ఆమె కూడా ఎటువంటి చర్యలు లేవు. వీరే కాకుండా ఇంకా సీనియర్‌లుగా ప్రస్తుతం పదవులు వెలగబెడుతోన్న మరికొంత మంది ఐఏఎస్‌లపైనా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.