కాదాంబరి కేసు జగన్‌ను కాటేస్తుందా...!?
అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు గతంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించబోతున్నారు. అధికారం ఉంది కదా..అని ఇష్టారాజ్యంగా దోచుకున్నదే కాకుండా..ఒక అమాయక మహిళను హింసించిన కేసు ఇప్పుడు జగన్ పీకకు చుట్టుకోబోతోంది. దాదాపు పదిహేనేళ్ల నుంచి అవినీతి కేసుల నుంచి చట్టం కళ్లుకప్పి తప్పించుకున్న జగన్ ఇప్పుడు సినీనటి కాదాంబరి జత్వాని కేసులో పీకల్లోతుకు కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. అంతా పైవాళ్లు చెబితేనే చేశామని సస్పెండ్ అయిన విశాల్ గున్నీ స్పష్టం చేయడంతో..ఇప్పుడు ఈ కేసులో అసలు పెద్దలు బయటకు రాబోతున్నారు. తనకు పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానీని ఎత్తుకు రమ్మని చెప్పాడని గున్నీ తన స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా చెప్పారు. మరి పిఎస్ఆర్‌కు ఆమెను తీసుకురమ్మని చెప్పిందెవరంటే..వేళ్లన్నీ జగన్‌వైపే చూపిస్తున్నాయి. తనకు వందలకోట్లు దోచిపెట్టిన బొంబాయి పారిశ్రామికవేత్తను రక్షించేందుకే..జగన్ సినీనటిపై అక్రమ కేసులు పెట్టించారనేది ఇప్పుడు బహిరంగ రహస్యమైపోయింది. ఇప్పుడు తన చేత ఆ పనిచేయించింది..అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగనేనని పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితే..జగన్ కొంప కొల్లేరు అవడం ఖాయం. వాస్తవానికి ఇలా జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తన బాస్ చెప్పాడని పిఎస్ఆర్ కనుక పోలీసుల విచారణలో చెబితే..ఆయనతో పాటు అప్పటి బాస్ జగన్ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే..ఈ పరిణామాలు అంత త్వరగా జరగకపోవచ్చు. పిఎస్ఆర్ కనుక నోరు తెరిస్తే...ముందు సజ్జల, తరువాత జగన్ ఆ వెనుక ముంబాయి పారిశ్రామికవేత్త..ఇలా అందరూ బయటకు రావల్సిందే. అప్పుడు ఇన్నాళ్లూ..బెయిల్‌పై ఉంటూ వస్తోన్న జగన్ బెయిల్ వెంటనే క్యాన్సిల్ కావడానికి అవకాశం ఉంది. అధికారాన్ని దుర్వినియోగం చేశారని, మహిళలపై కక్ష తీర్చుకోవడానికి తన అధికారాన్ని వినియోగించారని ఆధారాలతో స్పష్టం అవుతుంది కనుక జగన్ మరోసారి శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించక తప్పకపోవచ్చు. మొత్తం మీద..అమాయక మహిళను సొమ్ముల కోసం వేధించిన జగన్ ఆ మహిళ ఉసురు పోసుకుని మరోసారి జైలు జీవితం చవిచూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది.