వందపై కార్యకర్తల్లో అసహనం..అసంతృప్తి, ఆక్రోశం...!?
రాష్ట్రంలో దుష్ట,దుర్మార్గ, అరాచకపాలన అంతమై చంద్రబాబు పాలన వచ్చి వందరోజులైంది. ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన కొన్ని వర్గాల్లో సంతృప్తిని కల్గిస్తుండగా, మరికొన్నివర్గాల్లో ముఖ్యంగా టిడిపి కార్యకర్తల్లో, నాయకుల్లో, సానుభూతిపరుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆక్రోశం వ్యక్తమవుతోంది. తాము వంద రోజుల్లో బ్రహ్మాండంగా పాలన చేశామని చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒకొరికొకరు బాగానే డప్పుకొట్టుకున్నారు. మూడుపార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో..అన్నీ బాగున్నాయనట్లు..వాళ్లు అద్భుతమైన పాలన అందిస్తున్నామని ఒకొరినొకరు పొగుడుకున్నారు. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఒకొరికొకరు తగ్గకుండా మెచ్చేసుకున్నారు. వాళ్లు ఈ వందరోజుల్లో సాధించింది..ఏమిటో..తెలియక సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. అయితే..వారి సఖ్యత మాత్రం..ఆయా పార్టీ అభిమానుల్లో, కార్యకర్తలో ఆనందానికి కారణమైంది. తమ నాయకులు ఎన్నికల ముందు ఉన్నట్లే..ఇప్పటికీ ఉన్నారని, వారి మధ్య మంచి సఖ్యత, సహృద్భావం అలానే ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే..మరోవైపు..కార్యకర్తలు, సానుభూతిపరులు మాత్రం తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒక దుర్మార్గపాలకుడిని దించేసిన ఆనందం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదనే అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే..పాలనంతా మారిపోతుందని, అవినీతి, అక్రమాలు, రౌడీయిజం చేసిన వారిని అణిచేస్తారని వారు ఆశించారు. కానీ...వాళ్లు అనుకున్నదేదీ జరగడం లేదని అసంతృప్తి వారిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అవినీతి అధికారులను తొలగిస్తారనుకుంటే..వాళ్లే..ఇంకా కొనసాగడం, చంద్రబాబును ఆయన పుత్రుడిని నానా బూతులు తిట్టినవారే..మళ్లీ పెత్తనం చేయడం..గ్రామాల్లో, పట్టణాల్లో వైకాపాకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకోవడం వంటి చర్యలు వారిలో అసహనాన్ని పెంచుతున్నాయి. ఇక నామినేటెడ్ పదవుల భర్తీలో నానబెట్టడం, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి పనిచేసిన వారికి కనీసం గుర్తింపు లేకపోవడం..పదవులు వచ్చిన వారు..కార్యకర్తలను, అభిమానులను, పలకరించకపోవడం, ఎమ్మెల్యేలు..ఎంపీలు, మంత్రులు అంతరంగిక పదవుల్లో పార్టీ వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఎక్కడ చూసినా వైకాపా ప్రభుత్వంలో పెత్తనం చేసినవారే..ఇక్కడా ఉండడం..కార్యకర్తల్లో నిరుత్సాహానికి, అసహనానికి, అసంతృప్తి రేగడానికి కారణం అవుతున్నాయి. ఎన్నికల ముందు వరకూ తండ్రీ ఖబడ్డార్..మీ గుండెల్లో నిద్రపోతా..! అంటూ గాండ్రించారని, కొడుకు రెడ్‌బుక్ అంటూ..రెచ్చిపోయారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరూ గప్‌చుప్ అయ్యారనే ఆవేదన కార్యకర్తల్లో, అభిమానుల్లో బలంగా నెలకొంది. ఈ అసంతృప్తి ఇంకా పెరిగిపోతే..వచ్చే ఎన్నికల నాటికి టిడిపికి మనస్ఫూర్తిగా పనిచేసేవారు కరువవుతారనే భావన పార్టీని అభిమానించేవారిలో నెలకొంటోంది.