జర్నలిస్టు ఇళ్ల స్థలాల్లో కదలిక...!
జర్నలిస్టు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంలో కొంత కదలిక కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ఎన్‌డిఏ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతీసుకుంటున్నారని, రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో కొంత మంది జర్నలిస్టులు రెవిన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఈ విషయంపై కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, విధివిధాలను తెలియచేయాలని, గతంలో తీసుకున్నవారి విషయంలో ఎలా వ్యవహరించాలో అనేదానిపై కూడా ఒక విధానాన్ని తేవాలని ఆయన అన్నారు. గతంలో తీసుకున్నవారు అమ్ముకోవడానికి అనుమతి అడుగుతున్నారని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో..అని ఆయన ఆరా తీశారు. దాదాపు 23వేల మంది ఉన్నట్లు ఆయనను కలిసిన జర్నలిస్టులు తెలియచేశారు. అయితే..ఒకటి రెండు రోజుల్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మరోసారి చర్చిస్తామని మంత్రి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. సమాచారశాఖమంత్రి పార్థసారధి కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. గతంలో టిడిపి పార్టీ అనేకసార్లు అధికారంలో ఉన్నా..ఎప్పుడూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఈసారైనా..ఇవ్వాలని కొందరు జర్నలిస్టులు మంత్రిని కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం గతంలోనే అమరావతిలో జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని, కానీ..అవి ఆగిపోయాయని, ఇప్పుడు ఎమ్మెల్యేలతో పాటు జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉందని మంత్రి అనగాని అన్నారు. గత ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చి భారీగా ధరఖాస్తులను తీసుకుంది. అయితే..ఎన్నికల జిమ్మిక్కుగా దాన్ని మార్చివేసింది. జగన్ వలే కాకుండా..చంద్రబాబు ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ స్థలాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో దాదాపు రూ.1200కోట్లతో తెలంగాణ జర్నలిస్టులకు అక్కడి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇస్తోంది. అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని జర్నలిస్టులు కోరుతున్నారు.