జనసేనలోకి వైకాపా నేతల క్యూ...!
గత ఎన్నికల ప్రచారంలో వైకాపాను పాతాళంలోకి తొక్కుతానని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ అంటూ..జగన్ అప్పట్లో పవన్‌ను పదే పదే ఎద్దేవా చేసేవాడు. అయితే..కాలం మారడంతో..ఇప్పుడావంతు జనసేనకు వచ్చింది. ఒకప్పుడు జనసేనను గేళి చేసినవాళ్లంతా ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పలువురు జనసేన చుట్టూ తిరుగుతున్నారు. ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపాకు రాజీనామా చేసి, ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు. ఈ రోజు ఆయన పవన్‌కళ్యాణ్‌తో సమావేశం అయిన తరువాత..ఆయన పార్టీలో ఎప్పుడు చేరేది నిర్ణయిస్తారు. కాగా బాలినేనితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఇద్దరు వైకాపా తరుపున గెలుపొందారు. అలా గెలుపొందిన వారిలో ఒకరు బాలినేనికి అత్యంత సన్నిహితులు. ఆయన బాలినేనితో కలిసి జనసేన తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కాగా..వీరు కాకుండా పలువురు వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు జనసేనవైపు చూస్తున్నారు. కృష్టా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఉదయభాను జనసేనలో చేరతారని తెలుస్తోంది. ఆయనతో పాటు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పిఠాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య తదితరులు జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే..వీరిలో ముందుగా బాలినేని చేరతారని ఆ తరువాత వరుస చేరికలు ఉంటాయని తెలుస్తోంది.