విజిలెన్స్ కమీషనర్ రేసులో రిటైర్డ్ ఐఏఎస్ సాంబశివరావు...!?
ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమీషనర్ పోస్టులో కూటమి ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందోనన్న ఉత్కంఠత అధికారవర్గాల్లో ఉంది. పాలనాపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పదవిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. సాధారణంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం విజిలెన్స్ కమీషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ వీణావీష్ పనిచేస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోస్టులో ఎవరికి చంద్రబాబు అవకాశం ఇస్తారో..అనేదానిపై అధికారవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోవడంతో ఈ పదవిని భర్తీ చేస్తారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే..ప్రభుత్వపరంగా నియమించాల్సిన నామినేటెడ్ పదవులనే ఇంకా భర్తీ చేయకపోవడంతో ముఖ్యమంత్రి విజిలెన్స్ కమీషనర్ పోస్టులో ఎవరిని నియమించాలనేదానిపై దృష్టిసారించలేదని తెలుస్తోంది. అయితే పలువురు రిటైర్డ్ అధికారులు ఈ పోస్టు కోసం తమ వంతు ప్రయత్నాలను చేసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వివాదరహితుడు, సౌమ్యుడు అయిన ఎస్వీ ప్రసాద్‌ను విజిలెన్స్ కమీషనర్‌గా చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే..ఇప్పుడు ఇంత వివాదరహితుడు ఆయనకు ఎవరు దొరుకుతారు..? ఆ పోస్టుకు అర్హత ఉన్నవారి కోసం చంద్రబాబు వెతుకుతున్నారనే ప్రచారం మీడియా వర్గాల్లో జరుగుతోంది. అయితే..టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడానికి ముగ్గురు నలుగురు రిటైర్ఢ్ ఐఏఎస్ అధికారులు గట్టిగా కృషి చేశారు. అలా కృషిచేసిన వారిలో మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఠక్కర్, అనిల్‌చంద్రపునీతా, ఎల్వీ ప్రసాద్, కృష్ణయ్య తదితరులు ఉన్నారు. వీరిలో కృష్ణయ్యకు పొల్యూషన్ కంట్రోల్ ఛైర్మన్ పదవి దక్కింది. మిగిలిన వారిలో ఎల్వీ ప్రసాద్ ఈ పోస్టుపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఠక్కర్ కు ఆసక్తి ఉన్నా..ఆయనకు అవకాశం ఉంటుందో..లేదో..,చూడాలి. ఇక అనిల్ చంద్ర పునీతా కూడా రేసులో ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా ఆయన పనిచేస్తున్నారని అనిల్‌చంద్రను అప్పటి ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తరువాత ఆయన రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి చంద్రబాబుతో మంచి సంబంధాలనే నెరుపుతున్నారు. ఆయనకు అవకాశం ఉంటుందంటున్నారు. కాగా..రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాంబశివరావుకు అవకాశం ఉందంటున్నారు. నిజాయితీపరుడైన సాంబశివరావుకు ఈ పదవిఇస్తే..ఆయన హుందాగా వ్యవహరిస్తారని, ప్రభుత్వానికి మంచిపేరు తెస్తారనే అభిప్రాయం ఉంది. ఇక మరో మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిదినేష్ కుమార్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆయన పట్ల సానుకూలంగా లేరని తెలుస్తోంది. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన సాంబశివరావును చంద్రబాబు నియమించరని, ఆయన తన సామాజికవర్గాన్ని దూరం పెడతారనే అభిప్రాయాలు జర్నలిస్టు వర్గాల్లో ఉంది. మొత్తం మీద..విజిలెన్స్ కమీషనర్ పోస్టులో చంద్రబాబు ఎవరివైపు మొగ్గుచూపుతారో..అన్న ఆసక్తి అధికారవర్గాల్లో నెలకొంది. మొత్తం మీద..విజిలెన్స్ కమీషనర్ పోస్టులో చంద్రబాబు ఎవరివైపు మొగ్గుచూపుతారో..అన్న ఆసక్తి అధికారవర్గాల్లో నెలకొంది.