టిడిపి-జనసేన మధ్య బాలినేని చిచ్చు..!?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఏ కూటమి హానీమూన్ ముగిసినట్లే కనిపిస్తోంది. నిన్న వందరోజుల పండగ చేసుకున్న టిడిపి కూటమిలో అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించింది. కూటమిలో కీలకమైన డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు కూడా అవసరం ఉన్నా..లేకున్నా పవన్ కళ్యాణ్‌ను అభినందించారు. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా..అదే దోవలో సాగారు. పైకి వీరంతా..ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా కనిపించినా..ఎవరి భయాలు వారికి ఉన్నాయి. ఆ భయాలు బయటకు చెప్పకపోయినా..రాజకీయంగా బలపడడానికి ఎవరు వంతు ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా వైకాపా నుంచి వచ్చే నాయకులను తమ తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇద్దరు వైకాపా రాజ్యసభ సభ్యులను టిడిపి పార్టీలోకి ఆహ్వానించింది. ఇదే సమయంలో..జనసేన వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలపై గురిపెట్టింది. కనీసం పదిమంది మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉధయభాను, దొరబాబు, తోట త్రిమూర్తులు, కిలారు రోశయ్య, వెంకట్రామిరెడ్డి వంటి బలమైన నేతలు త్వరలో జనసేనలో చేరబోతున్నారు. అయితే వీరి అందరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం..టిడిపిలో చర్చకు కారణమవుతోంది. ఆయనను జనసేనలో చేర్చుకోవద్దని నేరుగా టిడిపి నేతలు చెప్పడం లేదు. అయితే..ఆయన జనసేనలో చేరితే కూటమి ఐక్యత చెడిపోతుందనే భావన వారిలో ఉంది. బాలినేని జనసేనలో చేరడంపై టిడిపి నాయకులను, మంత్రులను ప్రశ్నిస్తే వారు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అత్యంత వివాదాస్పద నాయకుడు బాలినేని అని ఆయన గతంలో టిడిపి నాయకులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని, ఆయన ఇప్పుడు జనసేనలో చేరితే..రేపటి నుంచి అక్కడ టిడిపి,జనసేనల మధ్య తగాదాలు తప్పవనే భావన టిడిపిలో ఉంది. బాలినేని, జగన్‌ల మధ్య బంధం చాలా గట్టిదని, ఆయన ఇప్పుడు తన అవసరాల కోసమే జనసేనలోకి వస్తున్నారని, జనసేనలో ఆయన ఎన్నాళ్లు ఉంటారో కూడా తెలియదనే భావన టిడిపి వర్గాల్లో ఉంది. అయితే మిత్రపక్షం బాలినేని ఆహ్వానిస్తుందని, వారిని తాము గౌరవిస్తామని, భవిష్యత్తులో ఇది ఎలాంటి మలుపులకు కారణం అవుతుందో తెలియదని వారు అంటున్నారు. జగన్, బాలినేని ఇద్దరూ కలిసే..కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని, దీనిలో భాగంగానే..ఆయనను జనసేనలోకి పంపుతున్నారనే భావన టిడిపిలో ఉంది. కాగా కూటమిని విచ్ఛన్నం చేసేందుకు..ఇది తొలి అడుగని, భవిష్యత్తులో కూటమి విచ్ఛన్నం అయితే..దానికి బాలినేనే కారణం అవుతారనే చర్చ టిడిపి వర్గాల్లో ఉంది. అయితే..పవన్ తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయనను ఆహ్వానించారని, వచ్చే ఎన్నికల నాటికి కనీసం వంద సీట్లలో పోటీ చేయాలనేది జనసేన ఎత్తుగడ అని, దాని కోసమే ఇటువంటి వారిని ఆహ్వానిస్తున్నారనే చర్చ సాగుతోంది. మొత్తం మీద..బాలినేని జనసేనలో చేరడం..ఇరుపార్టీల్లో అనుమానాలకు కారణం అవుతోంది.