మంత్రి నారాయణ ఆరాటం...!?
మున్సిపల్ మంత్రి నారాయణకు, సిఆర్‌డిఏ కమీషనర్ కాటంనేని భాస్కర్‌కు మధ్య జరుగుతున్న పరోక్షయుద్ధం తగ్గే ఛాన్స్ కనుచూపు మేర కనిపించడం లేదు. సిఆర్‌డిఏ కమీషనర్ కాటంనేని భాస్కర్‌ను బదిలీ చేయాలని మంత్రి నారాయణ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. భాస్కర్ తన మాట వినడం లేదని, ఆయనను బదిలీ చేయాలని, అలా అయితేనే..రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతాయని మంత్రి ముఖ్యమంత్రికి చెబుతున్నారు. అయితే..భాస్కర పనితనం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను కదిలించడానికి ఇష్టపడడం లేదు. అయితే..తనకు అత్యంత సన్నిహితుడైన నారాయణ మాటను కాదనలేనిపరిస్థితి. ఇద్దరూ కావలిసిన వారే అవడంతో ఎవరికి వదులుకోవాలో ముఖ్యమంత్రికి తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇద్దరి మధ్య రాజీ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే..వీరిద్దరూ ఇప్పటికీ రాజీకి రావడం లేదు. ఎవరికి వారు మౌనంగా ఉంటున్నారు. నిజాయితీపరుడు, పనిమంతుడు అయిన భాస్కర్‌ను తొలగిస్తే..పనిచేసే అధికారులను రాజకీయ ఒత్తిడితో తొలగించారనే భావన వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో తన సన్నిహితుడైన నారాయణను నొప్పించలేకపోతున్నారు. అసలు నారాయణకు, భాస్కర్‌కు ఏ అంశాల్లో విభేదాలు వచ్చాయో..తెలియదు కానీ..నారాయణ చెప్పిన పనులు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే చేయడం లేదని భాస్కర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. కాగా..నారాయణ ఉద్దేశాలు వేరే ఉన్నాయని, తాను చెప్పినట్లు వినేవారే తన వద్ద ఉండాలనే భావన ఆయనలో ఉందని, అదీ స్వకులానికి చెందిన వారిని నియమించుకోవాలను ఆరాటంలో మంత్రి ఉన్నారని, తన కులానికి చెందిన అధికారికి ఇప్పటికే..తన వద్ద పనిచేయడానికి సిద్ధం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. భాస్కర్‌ను ఈరోజు కాకపోతే..రేపైనా తొలగిస్తామని, ఆయన స్థానంలో స్వకులానికి చెందిన అధికారిని నియమించుకోవాలనే భావనతో నారాయణ ఉన్నారట. అతను అయితే..తాను చెప్పినట్లు తల ఊపుతారని, భాస్కర్ అయితే.. ఆ పనిచేయరనే ఉద్దేశ్యంతో..నారాయణ ఉన్నారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది.