TDP కార్యకర్తలు తిరగబడతారా...!?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ఇచ్చిన హామీలు, ప్రతీకార చర్యలు ఉంటాయన్న హామీని నిలబెట్టుకోకపోవడం అధికార టిడిపిలో చిచ్చుకు కారణమవుతోంది. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా చేసిన అరాచకాలపై, అన్యాయాలపై చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు కార్యకర్తలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, దీని కోసం ప్రత్యేకంగా రెడ్‌బుక్ తెచ్చామని, ఎవరెవరు..టిడిపి కార్యకర్తలను, నాయకులను వేధించారో..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పదే పదే తండ్రీకొడుకులు చెప్పారు. వారు ఆశించిన విధంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం టిడిపిలో చిచ్చుకు కారణమవుతోంది. సామాన్య కార్యకర్త నుంచి క్రియాశీలక కార్యకర్తలతో పాటు పార్టీ సానుభూతిపరులు కూడా తండ్రీకొడుకుల విధానాలతో చిన్నబుచ్చుకుంటున్నారు. అంతరంగిక సంభాషణల్లో తండ్రీకొడుకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు..తమను వాడుకున్నారని, ఇప్పుడు తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతుంటే..మా కన్నా..ఎక్కువ వేధింపులకు గురయ్యారా..? అంటూ దబాయిస్తున్నారని, వీరు ఎప్పటికీ వైకాపా వారిపై చర్యలు తీసుకోరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం గొంతులు కోయించుకున్న కుటుంబాలకు న్యాయం జరగలేదని, ఇలా అయితే..వచ్చే ఎన్నికల్లో నిజమైన పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పనిచేయరనే భావన పార్టీలో సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇది కేవలం పార్టీలోనే కాదు..పార్టీ కోసం పనిచేసిన కొన్ని మీడియా సంస్థల వైఖరి కూడా ఇదే విధంగా ఉంది. తాము చట్ట వ్యతిరేకంగా వైకాపా చర్యలు తీసుకోమని కోరడం లేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోమని కోరుతుంటే..మీన మేషాలు లెక్కిస్తున్నారని, అప్పట్లో అరాచకాలకు, అవినీతికి, అడ్డగోలు పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో వారి ముందు తాము చులకన అవుతున్నామని, అయినా..చంద్రబాబు, ఆయన తనయుడు పట్టించుకోవడం లేదని, భవిష్యత్తులో వారిని నమ్మి ముందుకు వెళ్లకూడదని కొంత మంది సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా అయితే..త్వరలోనే నిజమైన కార్యకర్తలు, సానుభూతిపరులు తిరుగుబాటు చేస్తారనే అభిప్రాయం పార్టీలో ఉంది.