మద్యం ఆదాయం రూ.30వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై వేల కోట్ల ఆదాయం రాబోతోంది. రాష్ట్రంలో ఏర్పడిన ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం మద్యంపై నూతన విధానం ప్రకటించింది. గతంలో ఉన్న ప్రభుత్వం మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయించింది. అయితే..ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకం కోసం వేలాన్ని నిర్వహించింది. నూతనంగా దాదాపుగా 3396 షాప్‌లను వేలం వేసింది. కేవలం షాపుల వేలం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1800 కోట్లు వచ్చాయి. గతంలో కన్నా ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. గతంలో టిడిపి అధికారంలో ఉన్న 2014-19 సంవత్సరాల్లో మద్యం షాపుల వేలం ద్వారా కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అయితే ఇప్పుడు గతంలో కన్నా షాపుల సంఖ్య గణనీయంగా తగ్గించినా..మద్యం షాపుల వేలంలో గణనీయమైన ఆదాయం వచ్చింది. అయితే..ఇప్పుడు వచ్చిన ఆదాయం కంటే మిన్నగా వస్తుందని ప్రభుత్వం ఆశించింది. అయితే..మద్యం వ్యాపారులు సిండికేట్ కావడంతో..మద్యం షాపుల వేలం ద్వారా అనుకున్నంత ఆదాయం రాలేదనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. కొన్నిచోట్ల మద్యం వ్యాపారులు, కూటమి నేతలు కుమ్మక్కు అవడంతో..మద్యం షాపులకు ఎక్కువ ధరఖాస్తులు రాలేదు. కాగా..రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఏడాదికి దాదాపు రూ.30వేల కోట్లు ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మద్యం షాపుల ద్వారా రేపటి నుంచి మద్యాన్ని అమ్మనుంది. నాణ్యమైన మద్యాన్ని క్వాటర్ బాటిల్ రూ.99\-కే అమ్ముతామని ప్రభుత్వ ఇప్పటికే స్పష్టం చేసింది. దీని ద్వారా మద్యం అమ్మకాలు ఇంకా పెరగనున్నాయి. గత జగన్ ప్రభుత్వం నాసిరకమైన మద్యాన్ని అదీ ఎక్కువ రేటు అమ్మడంతో..మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. మద్యం కొనుగోలు దారులు నాణ్యమైన మద్యం కోసం తెలంగాణ, ఒరిస్పా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లేవారు. మరోవైపు అక్రమసారా తయారీదారులు మద్యం అమ్మకాలకు గండికొట్టారు. అత్యంత నాసిరకమైన మద్యాన్ని అమ్మి జగన్ ప్రభుత్వం మద్యం వినియోగదారుల ప్రాణాలను తీసిందనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి ఎడాపెడా అప్పులు చేసింది. నాడు జగన్ ప్రభుత్వం మద్యం ఆదాయంపైనే చాలా సంక్షేమపథకాలను అమలు చేసింది. నాడు మద్యం ఆదాయాన్ని చూపి తెచ్చిన అప్పులను నేడు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కాగా..కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ జరుగుబాటుకు మద్యం ఆదాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.