చంద్రబాబు చిత్రాలపై చిన్నచూపు..ఇంకా జగన్ బొమ్మలే...!?
రాష్ట్రంలో అధికారం మారి దాదాపు నాలుగు నెలలు అయినా..ఇంకా కొద్ది మంది హెచ్ఓడీలు, అధికారులు మాత్రం ఇంకా జగనే ముఖ్యమంత్రి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులు, ఇప్పటికీ జగన్ పై విశ్వాసాన్ని, విధేయతను చాటుకుంటున్నారు. వారు పనిచేసే కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోను ఇంకా అలానే ఉండనిస్తున్నారు. సహజంగా అధికారం మారిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాల్లో గత ముఖ్యమంత్రి చిత్రాన్ని తొలగించి, నూతన ముఖ్యమంత్రి చిత్రాన్ని ఉంచుతారు. ఇది ఆనవాయితీ, మరియు ప్రోటోకాల్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల చిత్రాలను ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని వార్తలు వచ్చాయి. అయితే..కొన్ని కార్యాలయాల్లో ఇది జరిగినా మరికొన్ని కార్యాలయాల్లో మాత్రం జరగడం లేదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రం తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యమంత్రి చిత్రపటాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యాలయానికి పంపుతుంది. ప్రోటోకాల్ విభాగం దీన్ని పర్యవేక్షిస్తుంది. గతంలో రాష్ట్ర సమాచారశాఖ నుంచి ఇలా ముఖ్యమంత్రి చిత్రాలను పంపించేవారు. అయితే..ఈసారి అలా జరగలేదని, ఆయా రాష్ట్ర కార్యాలయాలకు, జిల్లా కార్యాలయాలకు రాష్ట్ర సమాచారశాఖ ముఖ్యమంత్రి చిత్రపటాన్ని పంపి దాన్ని ఫోటో తీసుకుని ఆయా కార్యాలయాల్లో పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర సమాచారశాఖ కానీ, ప్రోటోకాల్ విభాగం కాని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో కొన్ని చోట్ల ఆయా శాఖాధిపతులు సిఎం చిత్రాలను పెట్టించారు. అయితే జగన్ అభిమానులైన అధికారులు కొందరు చంద్రబాబు చిత్రపటాన్ని పెట్టించలేదు. అదే సమయంలో...గతంలో ఉన్న జగన్ చిత్రాన్ని తొలగించడం లేదు. అప్పట్లో ఉన్న ఆ చిత్రాలను అలానే కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నాయకులు ఈ విషయాన్ని గమనించి అడిగినప్పుడు మాత్రం మారుస్తున్నారు. మరి కొందరు అధికారులు అది మా ఇష్టం అంటూ దబాయిస్తున్నారు. మొత్తం మీద..ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కొందరు అధికారులు ఇవ్వడం లేదనేది సత్యమే. పాత నేతపై ఉన్న ఇష్టాఇష్టాలతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ విజయడైరీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రం లేకపోవడం, జగన్ చిత్రం ఉండడంతో ఆమె జోక్యం చేసుకుని చంద్రబాబు చిత్రాన్ని పెట్టించారు.