కమ్మవాళ్లా..తరువాత చూద్దాంలే...!?
రాష్ట్రంలో కమ్మవాళ్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. మొన్న మొన్నటి దాకా..జగన్ వేధింపులను తట్టుకోలేక చాలా మంది ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టారు. మరి కొందరు జగన్ ఏమి చేస్తున్నా మౌనాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలో ఉన్న ఈ సామాజికవర్గానికి చెందిన వారిలో చాలా మంది ఇదే రకమైన విధానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల్లో తమ సత్తా చాటుదామనే ఉద్దేశ్యంతో జగన్ ఎంత వేధించినా, అరాచకాలు, హత్యలు చేసినా..మౌనంగానే భరించారు. జగన్ అరాచకవిధానాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి పెద్దగా రాకపోయినా..ఎన్నికల్లో జగన్‌ను ఓడించడానికి తెరవెనుక బాగానే కృషి చేశారు. అదే విధంగా ఓట్లను కూడా కూటమి ప్రభుత్వానికి గంపగుత్తంగా గుద్దారు. కమ్మవాళ్లంటే.. తెలుగుదేశానికి ఓటు బ్యాంక్‌గా ఉంటారనే అభిప్రాయం కొన్ని వర్గాల్లో ఉంది. అయితే..అది నిజం కాదు. 2019 ఎన్నికల్లో ఈ వర్గంలో దాదాపు సగం మంది జగన్‌కు ఓటు వేశారు. అందువల్లే..ఆ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో జగన్ ఏకపక్ష విజయం సాధించారు. అదే 2024 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో టిడిపి క్లీన్ స్వీప్ చేసింది. గతంలో జగన్‌కు ఓటు వేసిన ఈ సామాజికవర్గానికి చెందిన వారు..ఈ ఎన్నికల్లో మాత్రం టిడిపికి ఏకపక్షంగా ఓటువేశారు. తమను టార్గెట్ చేస్తున్నారన్న భావనతో వారు ఒకేమాట మీదకు వచ్చి ఎన్నికల్లో తమ సత్తా చాటి, జగన్ ఓటమిలో ప్రధానపాత్ర పోషించారు. అయితే..ఎన్నికల్లో జగన్ ఓడిన తరువాత వీరి రాత మారుతుందని ఆశిస్తే..దానికి విరుద్దంగా ఈ సామాజికవర్గానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి తమ సామాజికవర్గానికి చెందిన వారైనా..వారికి ఆయన న్యాయం చేయడంలేదనే అభిప్రాయం ఆ వర్గంలో బలంగా ఉంది. అదే విధంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు.
గతంలో జగన్ కమ్మవాళ్లనే ఒకే ఒక్క కారణంతో..వివిధ స్థాయిల్లో ఉన్న కమ్మ ఉద్యోగులను హీనాతి హీనంగా చూశారు. ఘోరంగా అవమానించారు. వారికి సరైన పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. కేవలం ఆ సామాజికవర్గానికి చెందిన వారనే భావనతో..వారిని కించపరిచారు. వారిపై లేని పోని కేసులు పెట్టి వేధించారు. వారికి న్యాయంగా ఇవ్వాల్సిన ప్రమోషన్స్ కూడా ఇవ్వలేదు. మాజీ స్పీకర్, స్వర్గీయ కోడెల శివప్రసాదరావు వద్ద పనిచేసిన ఓ అధికారిని పర్నిచర్ కేసులో అన్యాయంగా ఇరికించి జీతం ఇవ్వకుండా వేధించారు. ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడమే దీనికి కారణం. ఆయనొక్కరే కాదు.. అందరికీ తెలిసిన ఏబీ వెంకటేశ్వరరావు సంగతి చెప్పాల్సిన పనే లేదు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు అతి తక్కువ మంది ఉంటారు. అలా ఉన్నవారిని జగన్ రాచిరంపాన పెట్టారు. ఐఏఎస్, ఐపిఎస్, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని జగనే స్వయంగా వేధించారు. వారిని మోల్ అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు.
సిఎం ఒకే అన్నా...!
చెడ్డ రోజులు పోయి మంచి రోజులు వచ్చాయని ఈ వర్గానికి చెందిన వారు సంతోషపడుతుంటే..అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే వీరి సంతోషమంతా ఆవిరైంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు..ముఖ్యమంత్రిని కానీ, ఆయన తనయుడిని కానీ కలవడం గగనమైవుతోంది. కమ్మ అధికారులను మంత్రుల వద్ద, ఎమ్మెల్యేల వద్ద నియమించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా అడిగినా...తమ వద్ద కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు వద్దంటూ మొహమాటం లేకుండా చెపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెబుతామంటే..వారు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదట. అదే విధంగా గతంలో పోస్టింగ్‌లకు దూరంగా పెట్టిన వారికి ఇప్పటి వరకూ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఉన్నతాధికారుల వద్ద వీరి ఫైల్స్ పేరుకుపోతున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారా..? తరువాత చూద్దాంలే..అంటూ..సాగదీస్తున్నారట. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు వెలువడినా..ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మాత్రం ఇంకా సాగదీస్తున్నారట. వివిధ స్థాయిలో అసమానతకు, అవమానాలకు గురైన ఈ సామాజికవర్గానికి చెందిన వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయం ఆ వర్గంలో వ్యక్తం అవుతోంది.