తల్లి,చెల్లిపై జగన్ కేసు...!?
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన మాతృమూర్తి వై.ఎస్.విజయమ్మ, సోదరి వై.ఎస్. షర్మిలపై కేసు పెట్టారు. తన ఆస్తిని మోసపూరితంగా చెల్లి పొందేందుకు కుట్ర చేస్తోందని, ఆ కుట్రను సాగనిచ్చేది లేదని, తాను గతంలో తల్లి విజయమ్మకు ఇచ్చిన వాటాను తిరిగి తనకు ఇవ్వాలని కోరుతూ ఆయన ఎన్‌సిఎల్‌టిలో కేసు వేశారు. ఈ కేసు నవంబర్ 9న విచారణకు రానుంది. సరస్వతి కంపెనీలో తన తల్లి విజయమ్మకు ఇచ్చిన షేర్లను తన సోదరి షర్మిల మోసపూరితంగా తన పేరుకు బదలాయించుకుందని, వాటిని తిరిగి తనకు ఇవ్వాలని ఆయన కేసు వేశారు. దీనిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై రాజీ కుదిరిందని, ఇక వారిద్దరూ కలిసిపోతున్నారని మీడియాలో ప్రచారం సాగింది. సార్వత్రిక ఎన్నికల ముందు షర్మిలకు ఆస్తులు ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్‌లో చేరి అన్న జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. జగన్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. పదునైన విమర్శలు, ఆరోపణలతో ఆమె జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంతో, జగన్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తనను ఆదుకునే మోడీ, షాలకు ఇప్పుడు చంద్రబాబు అవసరం ఉండడంతో..వారు బహిరంగంగా జగన్‌కు మద్దతు ఇవ్వలేకపోతున్నారు. దీనితో చంద్రబాబు చాపకింద నీరులా జగన్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అండకావాలనే భావనతో జగన్ కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని, అవసరమైతే తన పార్టీని విలీనం చేస్తానని ఆయన కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నారట. అయితే..ఇందుకు షర్మిల అడ్డు వస్తున్నారని, ఆమెకు ఆస్తులు పంచి ఇస్తే..ఆమె అడ్డంకి ఉండదని, అందుకే ఆయన ఆస్తుల పంపకానికి ఒప్పుకున్నారని కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేనని, ఆస్తుల్లో చిల్లిగవ్వ కూడా షర్మిలకు ఇవ్వడానికి ఆయన ఒప్పుకోవడం లేదని తాజా కేసులతో తేలిపోయింది. తన స్వంత సొమ్ము పైసా కూడా ఎవరికీ ఇవ్వని జగన్..సోదరికి న్యాయబద్దంగా ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వకపోవడం ఆయన నైజాన్ని తేటతెల్లం చేస్తోంది. మొత్తం మీద డబ్బుకు జగన్‌కు ఎంత లంకె ఉందో మరోసారి సాక్ష్యాధారాలతో బటయపడింది. గతంలో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రభుత్వ ఆస్తులను ఎడాపెడా దోచుకుని, కేసులను ఎదుర్కొని చివరకు జైలుకు కూడా వెళ్లివచ్చారు. తరువాత ముఖ్యమంత్రి అయినా కూడా సొమ్ముపై ఆయన మమకారాన్ని వదులుకోలేకపోయారు. తాను స్వయంగా ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ఆస్తులన్నీ తన స్వంతం అన్నట్లు దోచుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన అవినీతిని తవ్వితీస్తోంది. దీనిలో ఎన్నివేల కోట్లు బయటపడతాయో చూడాలి.