జగన్ రాష్ట్రాన్ని లూఠీ చేశారు: వాసిరెడ్డి పద్మ
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని లూఠీ చేశారని, పేద ప్రజలను దోచేశారని, ఆయన నియతృంత్వ ధోరణి వల్ల ప్రజలతో పాటు, పార్టీకి నష్టం జరిగిందని వైకాపాకు రాజీనామా చేసిన రాష్ట్ర మహిళా కమీషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. జగన్ మోసపూరిత వాగ్ధానాలతో పేద ప్రజలను లూఠీ చేశారని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పూడూ జరిగాయని, అప్పుడు ఆయనెందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. వైకాపాలో మహిళలకు కనీసగౌరవం ఇవ్వలేదని, వ్యక్తిగతంగా తనను కూడా అవమానపరిచారని, అయితే నిబద్దత కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశానని ఆమె చెప్పారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన లూఠీ చేయడమే ధ్యేయంగా పనిచేశారని, ముఖ్యంగా పేదలను దోచుకున్నారని, మద్యం వ్యాపారంతో బడుగు, బలహీనవర్గాలను దారుణంగా లూఠీ చేశారని ఆమె ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దీనిపై దృష్టి పెట్టలేదని, అయితే ఎన్నికలు అయిపోయిన తరువాత, వచ్చిన ప్రజాతీర్పును చూసిన తరువాత ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఎంతగా అసహ్యించుకున్నారో అర్థం అవుతుందని ఆమె అన్నారు.
పార్టీకి రాజీనామా చేసిన రోజే..ఆమె జగన్‌పై వ్యక్తిగతంగా ఆరోపణలుచేయడం ప్రాధన్యతను సంతరించుకుంది. మంచి వాగ్ధాటి కలిగిన వాసిరెడ్డి పద్మ తన రాజకీయజీవితాన్ని ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తరువాత ఆమె జగన్ పెట్టుకున్న వైకాపాలో చేరారు. అప్పటి నుంచి అదే పార్టీలోఉంటున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా పార్టీ ఆమెకు సరైన అవకాశాలు కల్పించలేదు. వాగ్ధాటి ఉన్న వాసిరెడ్డికి కనీసం ఎమ్మెల్సీ అయిన ఇస్తారని ఆమె ఆశించారు. అయితే..అటువంటి పదవేమీ ఇవ్వకుండా మహిళా కమీషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే తన స్థాయికి కనీసం ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇస్తారని ఆమె ఆశించగా, ఇచ్చిన పదవిని కూడా తరువాత వైకాపా అధినేత లాగేసుకున్నారు. ఈ పదవి పోయిన తరువాత వాసిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనలేదు.
జనసేనలో చేరతారా..!?
వైకాపాకు రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ జనసేన పార్టీలో చేరతారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. దీంతో..ఆమె జనసేన వైపు వెళతారనే అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు సమాజికవర్గానికి చెందిన ఆమె ఎస్సీ వర్గానికి చెందిన వారిని కులాంతర వివాహం చేసుకున్నారు. అభ్యుదయ సమాజం రావాలనే ధ్యేయంతో పనిచేసే ఆమె జనసేనలోనే విమడగలరనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద ఆమె జనసేనలో చేరితే..ఆ పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తారు.