మీడియా అధినేతలపై విషప్రచారం...!?
వైకాపా సోషల్ మీడియా రెచ్చిపోతోంది. కేవలం తమ ప్రత్యర్ధులైన రాజకీయ నాయకులనే కాకుండా, తమకు నచ్చని మీడియాకు చెందిన అధినేతలపై విషప్రచారానికి దిగుతోంది. గత రెండు రోజుల నుంచి టిడిపికి మద్దతుగా ఉంటోన్న రెండు ఛానెల్స్ అధినేతలపై ఇష్టారాజ్యంగా వైకాపా సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. టిడిపికి మద్దతు ఇస్తోన్న ఆ ఛానల్స్‌లో ఒకరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, ఓ డాక్టర్‌ను మీడియా అధిపతి రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఒకటే ప్రచారం చేస్తోంది. కాగా రెండో ఛానెల్ అధిపతికి డ్రగ్స్‌తో సంబంధం ఉందంటూ పోస్టింగ్‌లు పెడుతోంది. ఈ రెండు ఛానల్స్ అధినేతలు టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకి సన్నిహితులే. గురువారం నాడు టిడిపి ఓ సంచలన విషయాన్ని బయటపెడతామని, దానితో రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలురేగుతుందని, టిడిపి సోషల్ మీడియా కొన్ని రోజులుగా పోస్టింగ్‌లు పెడుతోంది. అది బహుశా జగన్‌కు సంబంధించిన అవినీతిపై అయి ఉంటుందని మీడియావర్గాలు ఊహిస్తుండగా, దానికి ప్రతిగా టిడిపికి మద్దతు ఇచ్చే రెండు ఛానెల్స్ అధినేతలపై వైకాపా సోషల్ మీడియా దండెత్తుతోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైకాపా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతోంది. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు పెడితే..వెంటనే వాళ్లను పోలీసులు అరెస్టు చేసి జైలు పాలు చేశారు. నాడు చాలా మందికి ఈ రకమైన అనుభవాలు ఎదురయ్యాయి. అయితే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా...వైకాపా సోషల్ మీడియా ఎక్కడా తగ్గడం లేదు. టిడిపి కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టిడిపి అధినేతలకు వ్యతిరేకంగా లక్షలాది పోస్టులు పెడుతున్నా కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. దాంతో..వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నీచానీచంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇద్దరు మీడియా అథిపతులపై వారు పెడుతోన్న పోస్టులు..చర్చనీయాంశంగా మారాయి. మరీ ముఖ్యంగా ఓ ఛానెల్ అధినేత రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ, ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ..పేరు పెట్టి చేస్తోన్న పోస్టులు సదరు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.