జగన్‌ను జనం నమ్ముతారా...!?
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి గతంలో తాను అమలు చేసిన వ్యూహాన్నే మళ్లీ అమలు చేయడానికి యత్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత, ఆయన వెంటనే జనంలోకి వెళుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని, ప్రజలకు దూరంగా తిరిగిన ఆయన, అధికారం పోయిన తరువాత విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కూటమి ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలు కూడా సమయం ఇవ్వకుండా దాడి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా..దానికి కారణం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లేనంటూ దూషిస్తున్నారు. తాను పాలించినప్పుడు రాష్ట్రం సువర్ణమయంగా ఉందని, ఇప్పుడు మాత్రం రాష్ట్రం ఎడారి అయిపోయిందనట్లు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, చంద్రబాబు ఆయన అనూయాయులు ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని, భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. మద్యం, ఇసుక, రాజధాని అమరావతి ఏదైనా కానివ్వండి చంద్రబాబు అండ్ కో దోచుకుంటున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఇంకా కుదురుకోక ముందే ఆయన చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు ప్రజల్లోకి బాగానే వెళుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కూడా ఆయన చేస్తోన్న విమర్శలపై స్పందన వస్తోంది. ముఖ్యంగా నీకు..పదిహేను..నీకు పదిహేను..నీకు పదిహేను..అనే వ్యాఖ్యలు వైకాపా అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. కూటమి ప్రతివారికి ఇస్తానన్న సొమ్ములు ఇంకా ఇవ్వలేదని, అదే తానుంటే..ఇప్పటికే అన్నీ ఇచ్చేవాడినని ఆయన చెప్పుకుంటున్నారు. అదే విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, హామీలను అమలు చేయడం లేదని జగన్ గొంతెత్తి అరుస్తున్నారు. గతంలో ఎప్పుడూ హత్యలు, మానభంగాలు జరగనట్లు, అవి ఇప్పుడే జరుగుతున్నట్లు ఆయన చేస్తోన్న హావభావాలు కొందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆయన ఎక్కడి వెళితే..అక్కడికి వేలాది మందిని ఆయన పార్టీ తరలిస్తోంది. దీంతో అక్కడి భారీగా జనసందోహం తయారవుతోంది. దీంతో..జగన్ పట్ల ప్రజల్లో అభిమానం పోలేదని, ఈవీఎంల వల్లే జగన్ ఓడిపోయారని, ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు.
పాత వ్యూహమే..!
జగన్ ఒక పద్దతి ప్రకారం అసత్యాలను, అర్థసత్యాలను పదే పదే ప్రజలకు చెబుతున్నారు. గతంలో కూడా ఆయన ఇదే వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించారు. అప్పట్లో అమరావతిపై పదే పదే కులముద్ర వేయడం, ఒకే కులానికి చంద్రబాబు దోచిపెడుతున్నారని విష ప్రచారం చేయడం, రాజధాని గ్రాఫిక్స్ అంటూ చేసిన ప్రచారం, 36మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారంటూ..రాష్ట్రపతికి ఫిర్యాదుచేయడం, పోలవరంపై అవినీతి ఆరోపణలు, పింక్‌డైమండ్ పోయిందంటూ..అప్పట్లో జగన్ ఆయన మద్దతుదారులు చేసిన విష ప్రచారాన్ని ప్రజలు బాగానే నమ్మారని, అప్పట్లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఈసారి కూడా ఆయన అదే వ్యూహాన్ని నమ్ముకున్నారు. ఓడిపోయిన రోజు నుంచే ఆయన ఈవిఎంల మాయ అంటూ మొదలు పెట్టి, ఇప్పుడు శాంతిభద్రతలు, మానభంగాలు, హత్యలు..అవినీతి, మద్యంపై చేస్తోన్న విమర్శలు దానిలో భాగమే. పదే పదే అసత్యాలను, అర్థసత్యాలను జనంపై ఆయన రుద్దుతున్నారు. ఆయన చేస్తోన్న ప్రచారానికి ఆయనకు చెందిన మీడియా కూడా బాగానే సహకరిస్తోంది. ఆయన పార్టీ నాయకులు, సోషల్‌మీడియా కూడా పెద్ద ఎత్తున్న ఈ విషప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే..ఆయన ఎంత చేసినా..గతంలో వలే..జగన్‌ను ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతారా..? అంటే చెప్పలేమనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఒక అసత్యాన్ని పదే పదే చెబుతూ..ప్రచారం చేస్తుంటే..కొంత మంది అయినా నమ్ముతారు..కదా..ముఖ్యంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఖచ్చితంగా నమ్ముతారు. వీరితో పాటు..దిగువ మధ్యతరగతి, బడుగుబలహీనవర్గాలు నమ్మే పరిస్థితి ఉంది.
విషప్రచారానికి విరుగుడేది...!
అయితే..కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్ చేస్తోన్న హడావుడి సామాన్య ప్రజలను, మధ్యతరగతి, ఎగువమధ్యతరగతి, తటస్థులను ఆకట్టుకోవడం లేదు.గతంలో ఆయన చేసిన అరాచకాలను, అవినీతిని, అక్రమాలను, అనైతిక పనులను వారు ఇంకా మర్చిపోలేదు. నాలుగు నెలలకే కొంపలు మునిగిపోయినట్లు ఆయన చేస్తోన్న అతిపై వారి నుంచి వ్యతిరేకత వస్తోంది. ఒకవైపు కూటమిప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తోందని, గతంలో జగన్ చేసిన అరాచకాలను సరిదిద్దుతూనే, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందనే భావన ఇప్పడిప్పుడే ప్రజల్లో నెలకొంటుంది. అయితే..టిడిపి కార్యకర్తలు, నాయకులు మాత్రం కూటమి ప్రభుత్వ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. వారిని పట్టించుకోవడం లేదనే భావనే దీనికి కారణం. జగన్ ఓటమిలో తాము క్రియాశీలకంగా పనిచేశామని, అయితే..తమ ఉద్దేశ్యాలను, తమ భావనలను చంద్రబాబు పట్టించుకోవడం లేదనే అసహనం వారిలో ఉంది. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకతను తెచ్చిపెడుతోంది. మొత్తం మీద జగన్ చేస్తోన్న విషప్రచారానికి కూటమి ప్రభుత్వం విరుగుడు కనిపెట్టకపోతే..గతంలో వలే ఎంత అభివృద్ధిచేసినా గత ఫలితాలే పునరావృతం అవుతాయనడంలో సందేహం లేదు. నామేకే వాస్తేగా మంత్రులతో, పార్టీ నాయకులతో జగన్‌ను తిట్టిస్తే ఉపయోగం ఉండదు. జగన్ చేస్తోన్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో..రుజువు చేసి..జగన్‌ను ప్రజల ముందు నిలబెట్టాలి. ఉదాహరణకు విజయవాడ వరదల్లో వందలకోట్ల అవినీతి జరిగిందని వైకాపా యాగీయాగీ చేస్తోంటే..కేవలం సాక్షి ఎడిటర్‌కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నోటీసులు ఇచ్చిన తరువాత వైకాపా తగ్గిందా..అంటే లేదు..మరింత ఎక్కువగా ప్రచారం చేస్తోంది. దీనిపై వెంటనే ఎంత ఖర్చు అయిందో..ఆధారాలతో ప్రజలకు చూపించి, సదరు అసత్యవార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు చేపడితేనే..ఈ విష ప్రచారం ఆగుతుంది. లేదంటే..అంతే సంగతులు.