అమ్మపై కేసు వేసిన దుర్మార్గుడు జగన్: షర్మిల
బహిరంగ లేఖ విడుదల
స్వంత తల్లిపై కేసు వేసిన దుర్మార్గుడు జగన్ అని ఆయన సోదరి వై.ఎస్.షర్మిల ఆరోపించారు. గత రెండు రోజులుగా జగన్‌కు, ఆమె మధ్య ఆస్తుల వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో ఉన్న ఆస్తుల వివాదంపై నిన్న వై.ఎస్.జగన్ మాట్లాడుతూ ఇటువంటివి ప్రతి ఇంటిలో ఉండేవేనని, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే..ఈ ఆస్తుల వివాదంలో ఈ రోజు సాక్షి మీడియాలో రెండు పేజీల ప్రత్యేక వార్త వచ్చింది. జగన్ ఆస్తులను న్యాయబద్దంగా పంచారని, గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం షర్మిలకు ఆస్తులు ఇచ్చామని, అయితే..చంద్రబాబుతో కలసి ఆమె తన బెయిల్ రద్దు చేయించడానికి కుట్ర పన్నారని, అందుకే ఆమెకు ఆస్తులు ఇవ్వలేకపోతున్నానంటూ..ఆ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై షర్మిల ఈరోజు స్పందించారు. దీనిపై ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు. తన తండ్రి సంపాదించిన ఆస్తులను నలుగురు మనమలకు సమానంగా పంచాలని కోరారని, అయితే..దానికి విరుద్ధంగా జగన్ ఆస్తులన్నీ తన వద్దే ఉంచుకున్నారని, తాను రాజకీయాల్లోకి వచ్చినందునే ఇచ్చిన ఆస్తులను కూడా లాగేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తనను చెల్లిలాగా చూడలేదని, తన తల్లికి గిప్ట్ డీడ్‌గా ఇచ్చిన ఆస్తులపై ఆయన కేసు వేశాడంటే..ఆయన వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. తన తండ్రి సంపాదించిన అన్ని ఆస్తుల్లో తనకు వాటా ఉందని, సాక్షి, యలహంక ప్రాపర్టీ, భారతీ సిమెంట్స్, క్లాసిక్ రియాల్టీల్లో సమాన వాటా ఉందని, అయితే 2019 ఎన్నికల తరువాత తన వాటా తనకు ఇస్తామని చెప్పి, తనకు కేవలం 40శాతం వాటానే ఇచ్చారని, మిగతా 60శాతం జగనే ఉంచుకున్నారని, ఇది తగదని తల్లి విజయమ్మ చెప్పినా వినిపించుకోకుండా ఎంఓయు చేయించారని, తాను కూడా ఆస్తుల గురించి పట్టించుకోకుండా ఆ ఎంఓయుపై సంతకం చేశానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన వద్ద ఎంఒయు ఐదేళ్లకు పైగా ఉందని, తాను ఎప్పుడూ దాన్ని బయటపెట్టలేదని, కావాలంటే..బైబిల్‌పై ప్రమాణం చేద్దామని ఆమె సవాల్ చేశారు. ఆస్తుల గురించి తానెప్పూడూ ఆరాటపడలేదని, అయితే సాక్షిలో తాను ఆస్తుల కోసమే తాపత్రయపడుతున్నట్లు వార్తలు రాశారని, దీన్ని వైఎస్సార్ అభిమానులు తప్పుగా అనుకోవద్దనే వివరణ ఇస్తున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు.