జగన్ అబద్దాలు చెబుతున్నారు: వై.ఎస్.విజయమ్మ
వై.ఎస్.కుటుంబ ఆస్తుల వ్యవహారం కీలకమలుపు తిరిగింది. వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల మధ్య గత కొన్ని రోజుల నుంచి కుటుంబ ఆస్తుల పంపకంపై వివాదం రగులుతోంది. తాము షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఎప్పుడో ఇచ్చామని, ఇక ఇచ్చేదేమీ లేదని, రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడే ఆస్తులను పంచేశారని జగన్ శిబిరం చెబుతోంది. అయితే..ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, ఆయన తల్లి, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేశారు. తనకు కొడుకూ, కూతురూ ముఖ్యమేనంటూ, తాను అన్యాయం జరిగిన వారి పక్షం ఉన్నానంటూ ఆమె లేఖలో స్పష్టం చేశారు. పరోక్షంగా జగన్ అబద్దాలు చెబుతున్నారంటూ..ఆమె వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలిద్దరూ అసత్యాలు చెబుతున్నారని, రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను జగన్ పేరు మీద, మరికొన్ని ఆస్తులు షర్మిల పేరుమీద పెట్టారని, అయితే..ఆయన మరణించిన తరువాత ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం చేశారని, ఆమె స్పష్టం చేశారు. విజయవాడలో ఆస్తుల పంపకం తన సమక్షంలోనే జరిగిందని, కుటుంబ ఆస్తులన్నింటిలోనూ షర్మిలకు భాగం ఉందని, భాగం ఉంది కాబట్టే రూ.200కోట్ల డివిడెండ్లు ఇచ్చారని, భాగం లేకపోతే అంత డివిడెండ్ ఎందుకు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ఎటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులతో పాటు, ఇడి ఎటాచ్‌మెంట్ లేని ఆస్తుల్లోనూ షర్మిలకు సమానభాగం ఉందని, సరస్వతి, యహలంక, భారతిసిమెంట్, సాక్షి, హైదరాబాద్‌లోని ఇంటిలో షర్మిలకు వాటా రావాల్సి ఉందని, అప్పుడు జరిగిన ఆస్తుల పంపకం సందర్భంగా ముందు అటాచ్‌మెంట్‌లో లేని ఆస్తులను ఇచ్చారని, మిగతావి కేసులు తేలిన తరువాత ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. మొత్తం మీద...షర్మిలకు జగన్ ఆస్తులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించారు. వైకాపా నాయకులంతా అసత్యాలను చెబుతున్నారని, అసలైన నిజాలను చెప్పడానికే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆమె చెప్పుకున్నారు.