పదవీబాధ్యతలు చేపట్టిన పునీతా
విజిలెన్స్ కమీషనర్‌గా అనిల్‌చంద్ర పునీతా బాధ్యతలు చేపట్టారు. బుధవారం నాడు ఆయన సచివాలయంలోని విజిలెన్స్ కార్యాలయంలో పదవీబాధ్యతలను స్వీకరించారు. 2019 ఎన్నికల ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఎన్నికల సమయంలో ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి అప్పటి ఎన్నికల సంఘం తప్పించింది. నాడు టిడిపికి ఆయన సహకరిస్తున్నారని వైకాపా నేతలు ఫిర్యాదు చేయడంతో..ఆయనపై అప్పట్లో వేటుపడింది. ఎన్నికల తరువాత ఆయన రిటైర్డ్ అయ్యారు. ఎన్నికల తరువాత ఆయన చంద్రబాబుతో కలిసే ఉన్నారు. అయితే..ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి గెలుపొందడంతో అనిల్‌చంద్ర పునీతాకు విజిలెన్స్ కమీషనర్ పోస్టు ఇస్తారని Janamonline.com తన సెప్టెంబర్ 19న ఇచ్చిన వార్తలో పేర్కొంది.(https://www.janamonline.com/article?nid=256) రిటైర్ఢ్ ఐఏఎస్‌లు సాంబశివరావు, ఎల్‌వి సుబ్రహ్మణ్యం,ఠక్కర్ తదితరులు రేసులో ఉన్నారని పేర్కొంది. అయితే..వీరిలో సాంబశివరావు నిజాయితీపరుడు, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని తెలిపింది. అయితే కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయనను చంద్రబాబు ఎంచుకోరని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో పునీతాకు అవకాశాలు అధికంగా ఉన్నాయని నాటి కథనంలో పేర్కొంది. అంచనా వేసిన విధంగానే అనిల్‌చంద్ర పునీతాకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అప్పట్లో ఆయనకు అన్యాయం జరిగిందనే భావనతో చంద్రబాబు విజిలెన్స్ కమీషనర్ పోస్టుకు పునీతాకు ఇచ్చారని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద..తన సామాజికవర్గాన్ని కాదని చంద్రబాబు పునీతాకు ప్రాధాన్యత ఇచ్చారు. లౌక్యంగా వ్యవహరిస్తారనే పేరున్న పునీతా..తన బాధ్యతలను ఎలా నిర్వహిస్తారో చూడాలి.