ఒత్తిడికి లొంగని బాబు: టీటీడీ ఛైర్మన్‌గా బిఆర్ నాయుడు...!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కొందరు చేసిన ఒత్తిడిని తట్టుకుని, తాను ముందు అనుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌గా టివి5 అధినేత బి.ఆర్.నాయుడునే ఆయన నియమించారు. ఆయనతో పాటు బోర్డు మెంబర్లను కూడా ఈ రోజు ప్రకటించారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిని బి.ఆర్.నాయుడుకు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే..అందరూ అనుకున్నట్లు అది అంత ఈజీ కాలేదు. ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వకూడదని పార్టీలోని కొందరితో పాటు, ప్రత్యర్ధులు కూడా గట్టిగానే ప్రయత్నించారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మద్దుతుగా, రాజధాని అమరావతికి మద్దుతుగా టివి5 గట్టిగానే పనిచేసింది. ఎవరు ఏమి అనుకున్నా నమ్ముకున్న సిద్ధాంతం కోసం జగన్‌తోనూ, ఆయన మద్దతుదార్లతోనూ హోరాహోరిగా పోరాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం టివి5 ఛైర్మన్ బి.ఆర్.నాయుడుతో పాటు, ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టులు మూర్తి, సాంబశివరావుపై కేసులు నమోదు చేయించింది. ముఖ్యంగా మూర్తిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నిరంకుశపాలకుడిపై టివి5 ఛైర్మన్ చేసిన పోరాటానికి ఫలితంగా ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఛైర్మన్ పదవిని ఆయనకు ఇవ్వాలని టిడిపి అధినేత నిర్ణయించారు. అయితే..దాన్ని అమలు చేయడం అంత త్వరగా సాధ్యపడలేదు.
ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వవద్దని టిడిపికి మద్దతు ఇచ్చే మరో ఛానెల్ యాజమాన్యం చంద్రబాబుపై ఒత్తిడి చేసిందంటారు. దీనిలో నిజమేమిటో..ఎవరికీ తెలియదు. అదే సమయంలో బి.ఆర్ కు పదవి రాకుండా చేసేందుకు జగన్ గ్యాంగ్ ఆయనకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారాన్ని ప్రారంభించింది. ఒక వైపు టిడిపిలోని ఓ వర్గం, మరో వైపు జగన్ గ్యాంగ్ ఒత్తిడిని తట్టుకుని చంద్రబాబు ఆయనకు పదవిని ఇస్తారా..? ఇవ్వరా..అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే..ఆ ఒత్తిడిని తట్టుకుని చంద్రబాబు నాయుడునే టిటిడి ఛైర్మన్‌గా నియమించాలని నిర్ణయించి ప్రకటన చేయించారు. మొత్తం మీద..ఎవరు ఎంత మొత్తుకున్నా, ఆరోపణలు చేసినా బి.ఆర్.నాయుడుకే ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఛైర్మన్ పదవి లభించింది. చాలా కాలం తరువాత ఒక కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబులు పలుసార్లు ముఖ్యమంత్రులుగా పనిచేసినా..టీటీడీ ఛైర్మన్ ఆ సామాజికవర్గానికి చెందిన వారికి ఎవరికీ లభించలేదు. 1994,1999, 2014ల్లో చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా..అప్పట్లో ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఆయన కొంత ధైర్యం చేశారనే మాట టిడిపి వర్గాల నుంచి వస్తోంది. గతంలో టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని మాజీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సినీనటుడు మురళీమోహన్ తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. గతంలోనూ చంద్రబాబు బీసీలకు, కాపులకు టీటీడీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే..ఈసారి మాత్రం స్వంత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు.