టీటీడీ పాలకమండలిలో సగం మంది ఇతరులే...!
ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తారని టిడిపి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పటిలాగే నిదానంగా,నింపాదిగా బోర్డును నియమించారు. ఆయన అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు పూర్తి అవుతున్న తరుణంలో ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. ఇది టిడిపి కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో నిరాశను కల్గించింది. అందరూ భావించినట్లే...టీటీడీ ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడును నియమించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్.రాజులను పాలకమండలిలో నియమించారు. మొత్తం 24మందితో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో దాదాపు సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. 24 మందిలో 12మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఒకరిని బోర్టులో నియమించారు. కాగా జనసేన నుంచి ముగ్గురికి టీటీడీ పాలకమండలిలో స్థానం లభించింది. బిజెపి నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం ఉంది. మిగిలిన వారు టిడిపికి చెందిన వారు. గత జగన్ ప్రభుత్వంలో టీటీడీలో సభ్యులుగా ఉన్న జంగాకృష్ణమూర్తికి ఈసారీ ప్రాతినిధ్యం లభించడం విశేషం. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, కోవిద్ వ్యాక్సిన్ సుచిత్రా ఎల్లా, తెలంగాణ టిడిపిలో క్రియాశీలకంగా పనిచేసే నన్నూరి నర్సిరెడ్డిలు టీటీడీలో స్థానం దక్కించుకున్నారు.