టీటీడీ ఛైర్మన్ నాయుడుపై వైకాపా యాగీ...!?
టీటీడీ ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడును నియమించబోతున్నట్లు ప్రభుత్వం నుంచి ప్రకటవచ్చీ రాకముందే..ఆయనను లక్ష్యంగా చేసుకుని వైకాపా సోషల్ మీడియా చెలరేగిపోతోంది. టీటీడీ పాలకమండలిపై ప్రభుత్వం నుంచి ఇంకా జీవో కూడా రాలేదు. అప్పుడే వైకాపా పచ్చి అబద్దాలతో, మార్ఫింగ్ ఫోటోలతో వారికి అలవాటైనశైలిలో రెచ్చిపోతోంది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు క్రిస్టియన్ అంటూ మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో సర్కులేషన్ చేస్తోంది. అంతే కాదు..గతంలో టివి5లో ప్రసారమైన శృంగారపరమైన కథనాలను మీడియాలో పోస్టు చేస్తూ..నూతన ఛైర్మన్ వ్యవహారాలను చూడండి..ఇటువంటి వ్యక్తి పరమపవిత్రమైన టీటీడీకి ఛైర్మనా..? అంటూ పోస్టింగ్‌లు పెడుతోంది. గతంలో టివి5లో అర్థరాత్రివేళ కొన్ని శృంగార సన్నివేశాలను ప్రసారం చేసేవారు. అప్పుడెప్పుడో వచ్చిన వాటిని ఇప్పుడు బయటకు తీసి బి.ఆర్.నాయుడు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వైకాపా అడ్డూఅదుపూ లేకుండా విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవానికి నాయుడును టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం వైకాపాకు అసలు ఇష్టం లేదు. ఆయనను టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తారనే వార్తలు వచ్చిన వెంటనే ఆయనకు, ఆయన కుమారుడికి డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయంటూ..తమ సోషల్ మీడియాతో పాటు, తమకు మద్దతు ఇచ్చే యూట్యాబ్‌ఛానెల్స్‌లో కథనాలను వండివార్చింది. అయితే..వీరు చేస్తోన్న ఆరోపణలను టిటిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు పట్టించుకోలేదు. వీరు ఎంత యాగీ చేసినా..బి.ఆర్.నాయుడునే..టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా..ప్రస్తుతం విడుదలైన టీటీడీ బోర్డులో ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయని ఏబీఎన్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిలో నిజమెంతో కానీ, నిన్న బోర్డును ప్రకటించిన సిఎంఓ కార్యాలయం దానిపై జీవోను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. అయితే..బిజెపికి చెందిన మరో వ్యక్తిని బోర్డులో నియమిస్తారని, బిజెపి నుంచి ఆ పేరు ఇంకా రాలేదని, అందుకే జీవో విడుదల చేయడం ఆలస్యం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని భారీగా టీటీడీలో సభ్యులుగా నియమించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సెమీ ఇండియన్ టీటీడీ పాలకమండలి....!
టీటీడీ పాలకమండలిలో సగానికి పైగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని నియమించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారిని టీటీడీలో నియమించారు. దీంతో ఇది టీటీడీ పాలకమండలి కాదు..సెమీ ఇండియన్ టీటీడీ పాలకమండలిలా ఉందనే వ్యాఖ్యలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టీటీడీ బోర్డులో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిలో ఒక్కొక్కరిని నియమించేవారు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత సోదర రాష్ట్రమైనందున వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే..ఈసారి నియమించిన బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికంటే ఇతర రాష్ట్రాలకుచెందిన వారే అధికంగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా..టీటీడీ బోర్డును పరిమితంగానే ఏర్పాటు చేసినా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎక్కువగా నియమించడంపై విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.