చంద్రబాబు ఇచ్చిన అలుసుతోనే...!?
రాష్ట్రంలో శాంతిభద్రతలు, సోషల్‌మీడియా అంశాలపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. శాంతిభద్రతల విషయంలో హోంమంత్రి అనిత చురుగ్గా వ్యవహరించాలని కోరుతూ పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ టార్గెట్ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ వ్యవహారశైలి వల్లే..రాష్ట్రంలో శాంతిభద్రతలు, వైకాపా గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయనే భావన ఆయనలో ఉందంటున్నారు. ఇది కొంత వరకూ నిజమే. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాము కక్షపూరిత రాజకీయాలు చేయమని చెబుతూ తమ ప్రత్యర్ధులు, తమపై విషం చిమ్ముతున్నవారిపై కూడా ఉదారంగా వ్యహరించారు. దీంతో..వైకాపా పేటీఎమ్ బ్యాచ్ రెచ్చిపోయింది. చంద్రబాబును, పవన్, లోకేష్‌లతో పాటు వారి ఇళ్లలో ఉన్న ఆడవారిపై కూడా నీచంగా దూషిస్తూ..పోస్టులు పెడుతోంది. దీనిపై పార్టీ సానుభూతిపరులు చంద్రబాబుకు, లోకేష్‌కు ఎన్నిసార్లు విన్నవించినా..వారు పట్టించుకోలేదు. దీంతో..వైకాపా కాలకేయ బ్యాచ్ మరింతగా రెచ్చిపోతోంది. దీంతో పవన్ తమది మంచి ప్రభుత్వమని, అయితే..మెతక ప్రభుత్వం కాదంటూనే హోంమంత్రిపై వ్యాఖ్యలు చేశారు. అయితే..ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి వల్లే జరుగుతోందంటూ..టిడిపి, జనసేన కూటమి నేతలు,కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పుచేసిన అధికారులపై చర్యలేవి...?
కక్షపూరిత రాజకీయాలు చేయమంటున్నారు..ఓకే..కానీ తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా వారికి రాచమర్యాదలు చేసి ఇంటికి పంపిస్తే..ఇంకెవరైనా..మాట వింటారా..? జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు అవినీతి, అరాచకాలకు పాల్పడిన రిటైర్ఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ లు మాలకొండయ్య, ప్రవీణ్ ప్రకాష్, విజయ్‌కుమార్‌రెడ్డి, సత్యనారాయణ, ధనుంజయరెడ్డి, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్, రజిత్ భార్గవ, ఇలా ఒకరేమిటి పలువురు అధికారులను గౌరవంగా సాగనంపారు. పైన పేర్కొన్న అధికారులందరూ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతికి, అరాచకాలకు పాల్పడిన వారే. కానీ..వారిపై ఈగ వాలకుండా చంద్రబాబు వారిని ఇంటికి పంపించారు. బరితెగించి అవినీతి, అక్రమాలకు, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. అదే విధంగా ఉన్నత స్థాయి పోలీసు అధికారులపై చర్యలు ఎందుకు లేవు..? పివి సునీల్ కుమార్, సంజయ్‌లు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, ఎంత అరాచకంగా వ్యవహరించారో..రాష్ట్రం అంతా చూసింది. కానీ వారిపైచర్యలు మాత్రం లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మిగతా అధికారులకు ఏమి భయం ఉంటుంది? వీళ్లు మనలను ఏమీ చేయలేరు..? వీళ్లు ఇంతే..? వీళ్లకు భయపడేదేముందన్న అలుసు వారిలో రోజు రోజుకు పెరిగిపోతోంది. అధికారుల తీరు ఇలా ఉంటే..వైకాపా సోషల్‌మీడియా కూడా ఇదే రీతిలో బెదిరిస్తోంది. మాజీ మంత్రి పేర్నినాని టిడిపి నేతలను పరిగెత్తిస్తాడటా..? ప్రతిపక్షంలో ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే..చంద్రబాబు ఇచ్చిన అలుసు దీనికి కారణం కాదా..? పోనీ పేర్నినాని నీతిమంతుడు, ఆదర్శవంతమైన నేతనా..? అంత నిర్భయంగా మాట్లాడడానికి...? దొంగలు, ఖూనీకోరులు, హంతకులు, రేపిస్టులపై చర్యలు తీసుకోవడానికి భయమెందుకు..? ఇప్పటికైనా..ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే..కూటమి ప్రభుత్వానికి మరిన్ని గడ్డు రోజులు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.