నారాయణ చేతిలో రూ.60వేల కోట్లు...!
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.60వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని వినియోగించబోతోంది. ప్రపంచబ్యాంక్, హడ్కో, ఇంకా ఇతర మార్గాల ద్వారా ఈ నిధులను సమీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం నిధులను ఇప్పించడానికి, ఇతర మార్గాల ద్వారా సేకరించడానికి తన వంతు కృషి చేస్తోంది. గతంలో రాజధాని నిర్మాణం చేయాలంటే లక్ష కోట్లు కావాల్సి ఉంటుందని, ఇంత మొత్తం ఎక్కడ నుంచి తెస్తారని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి టిడిపి నాయకులను, అమరావతి మద్దతుదారులను అడిగేవారు. అయితే..చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం నిధులను ఎలా తేవాలో చేతల్లో చేసి చూపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘనవిజయం సాధించడం, కేంద్రంలో టిడిపి, జనసేన మద్దతు అవసరం అవడంతో..చంద్రబాబుకు ఆర్థిక కష్టాలు తొలిగిపోయాయి. ఆయన అడిగిన వెంటనే వివిధ మార్గాల ద్వారా కేంద్రం ఆర్థికంగా సహకరిస్తోంది. దీంతో..రాజధానికి నెలకొన్న ఆర్థిక కష్టాలు తొలిగిపోయాయి. రాబోయే మూడేళ్లలో ఈ రూ.60వేల కోట్లతో 360 కి.మీ ట్రంక్‌రోడ్డు మరియు ఇతర రోడ్లు, 3600 అధికారుల ఇళ్లు, దీనిలో మంత్రుల క్వాటర్స్, బంగ్లాలు ఉంటాయి. ఇవి కాకుండా అసెంబ్లీ భవనాలు, హైకోర్టు భవనాలు మరియు ఐదు పరిపాలనా భవనాలను నిర్మించబోతున్నారు.
నారాయణపై చంద్రబాబుకు విశ్వాసం...!
అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నారాయణ చేతిలో పెట్టారు. గతంలో 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రాజధాని బాధ్యతలను చంద్రబాబు నారాయణకే ఇచ్చారు. అప్పట్లో ఆయన ఆధ్వర్యంలోనే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. అయితే దీనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అప్పట్లో నారాయణ సరిగా పనిచేయలేదని, రాజధాని పనులను వేగంగా పూర్తి చేయలేకపోయారని స్వంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. తాత్కాలిక సచివాలయాన్ని కూడా ఆయన సరిగా నిర్మించలేకపోయారనే భావన ఉంది. అయితే ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా..చంద్రబాబు మళ్లీ నారాయణకే రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన చేతులమీదుగా ఇప్పుడు దాదాపు రూ.60వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కాగా నారాయణకు మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులకు పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఆయన పనితీరు సీనియర్ అధికారులకు నచ్చడం లేదని, ఆయన తన చుట్టూ ఉండేవారికే రాజధానిపనులు అప్పగిస్తున్నారని, అలా చేయకపోతే వారిపై నారాయణ ఒత్తిడి తెస్తున్నారంటున్నారు. నారాయణకు చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యంతో..మున్సిపల్, సిఆర్‌డిఏ అధికారులు నారాయణ మాటను కాదనలేకపోతున్నారు. కొందరు అధికారులు మాత్రం రూల్స్ ప్రకారమే వెళుతున్నారు. వేలకోట్లు తన చేతిమీదుగా వెళుతున్నప్పుడు మంత్రి నారాయణ క్రమశిక్షణతో, ఆశ్రితపక్షపాతం లేకుండా వెళ్లాలని, రాజధానిని నిర్మించి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఆయనకు వచ్చింది. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.