అనిత హుందాతనం...!
పవన్ కళ్యాణ్ ఉదంతంలో హోంమంత్రి అనిత వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆమె ఎంతో హుందాగా వ్యవహరించారని మెజార్టీ టిడిపి, జనసేన కార్యకర్తలు, నాయకులు అంతరంగిక సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత మరింత క్రియాశీలకంగా పనిచేయాలని, అవసరమైతే తానే హోంమంత్రి పదవి తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అనడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు, ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, ఇలా అయితే..ఎలా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి, కూటమి ఐక్యత భంగానికి కారణమవుతాయనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పవన్ వ్యాఖ్యలపై కూటమిలో అంతగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఆయన వ్యాఖ్యలను అసంతృప్తితో ఉన్న టిడిపి, జనసేన కార్యకర్తలకు సంతోషాన్ని ఇవ్వగా మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, ఇలా బహిరంగా మాట్లాడితే ఎలా..? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తన సహచర మంత్రిని బహిరంగ సభలో తప్పుపడితే..పవన్ కూడా ఫెయిల్ అయినట్లేగా..? రేపు ఇంకో మంత్రి పవన్ తనశాఖలను నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారని బహిరంగంగా అంటే..పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు వారి వద్ద నుంచి వస్తున్నాయి. కాగా..దీనిపై చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఇంత వరకూ స్పందించలేదు.
ఇది ఇలా ఉంటే..పవన్ తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో హోంమంత్రి అనిత చాలా హుందాగా వ్యహరించారని, తనను అవమానించినా..ఆ బాధను బయటకు రానీయకుండా, కూటమి ఐక్యత చెడిపోకుండా సమయస్పూర్తిగా వ్యవహరించారనే వ్యాఖ్యలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఆమె కనుక దీన్ని రాజకీయం చేయాలనుకుంటే వేరే విధంగా ఉండేదని, అయితే..ఒక క్రమశిక్షణ కలిగిన టిడిపి కార్యకర్తగా ఆమె పద్దతిగా వ్యవహరించారంటున్నారు. ఆమె ఈ విషయంలో వ్యవహరించిన తీరుతో ఒక మెట్టు ఎదిగారనే మాటా వినిపిస్తోంది. టిడిపి ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా నేతలు, కార్యకర్తలు ఎంత వేధించినా..ఆమె రాజీపడకుండా వారితో హోరాహోరిగా పోరాడారు. ఒక సామాన్య టీచర్ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు విజయం సాధించిన ఆమె రాజకీయచదరంగంలో పావులు బాగానే కదుపుతున్నారు.