వీళ్లెందుకు నచ్చలేదో...!?
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడిన చాలా మందిని టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టింది. వారి సేవలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇందులో కొంత మంది అధికారపార్టీ నేతలు మరి కొందరు ఇతర రంగాలకు చెందిన వారు ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే వీరికి మంచి ప్రాధాన్యత దక్కుతుందని అందరూ భావించారు. అయితే వారి అంచనాలకు విరుద్ధంగా వీరిని అధికార కూటమి పక్కకు పెట్టింది. ఇలా పక్కకు పెట్టిన వారిలో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వెంకటరెడ్డి, బ్రహ్మంచౌదరి, ఆనం రమణారెడ్డి, కుటుంబరావులు ప్రముఖులు. అదే విధంగా రిటైర్డ్ ఐఏఎస్‌ల్లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం, ఠక్కర్, లక్ష్మీనారాయణల విషయంలోనూ అదే జరిగింది. ఇక జర్నలిస్టుల్లో టిడిపి తరుపున గట్టిగా మాట్లాడిన వారిలో ప్రముఖుడు కందుల రమేష్. ఎందుకో ఆయనను తండ్రీకొడుకులు అసలు పట్టించుకోవడం లేదు. అదే విధంగా టిడిపికి గొడ్డుచాకిరి చేసిన జర్నలిస్టు ప్రముఖుడు సత్యమూర్తికి ఏ పోస్టూ ఇవ్వలేదు. ఇస్తారన్న ఆశతో ఆయన ఉన్నారు. ఇక టివి5, ఏబీఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో పనిచేసిన వారిలో కొందరికైనా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు వస్తుందని భావించినా..ఎవరినీ దేకడం లేదు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారు, సానుభూతిపరులు అధికారంలోకి వచ్చిన తరువాత తండ్రీకొడుకులకు ఎందుకు నచ్చడంలో ఎవరికీ తెలియడం లేదు. తమ పని అయిపోయింది..ఇక వీరితో పనేముందన్న భావనేమో. అదే విధంగా పలు పత్రికల్లో పనిచేసిన వారిలో మంత్రుల వద్ద పిఆర్వోలుగా పెట్టుకునే సంప్రదాయం గతంలో ఉంది. అయితే..ఈసారి జర్నలిస్టుల్లో టిడిపికి సానుభూతిపరులుగా ఉన్నవారికి అవకాశం వస్తుందని భావించగా అదేమీ జరగలేదు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన జర్నలిస్టులనైతే..దరిదాపుల్లోకి రానీయడం లేదు. మొత్తం 24మంది మంత్రులు ఉండే వీరిలో ఇద్దరో ముగ్గురో కమ్మవర్గానికి చెందిన జర్నలిస్టులు పిఆర్వోలుగా ఉన్నారు. అదీ వారు స్వంతంగా ప్రయత్నాలు చేసుకుంటేనే వారికి అదైనా దొరికింది. మొత్తం మీద..వివిధ వర్గాల్లో టిడిపి అనుకూలంగా పనిచేసిన వారికి, పార్టీలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వారికి ప్రస్తుతానికి ఎటువంటి గుర్తింపు లభించలేదు.