వైకాపా మాజీ మంత్రి నాగార్జునతో టిడిపి కుమ్మక్కు...!?
టిడిపిలోకి వస్తానని మేరుగ హామీ...!
లైంగిక వేధింపుల కేసులో అరెస్టు తప్పించుకోవడానికే..!
వైకాపాకు చెందిన నాయకులతో టిడిపి నాయకులు పలుచోట్ల పలువిషయాల్లో కుమ్మక్కువుతున్నారని తెలుస్తోంది. మద్యంషాపుల వేలంలో, ఇసుక విషయంలో ఇంకా అనేక ఇతర విషయాల్లో వారూ...వీరూ కలిసి నీకు అది..నాకు ఇది..అంటూ సొమ్ములు చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వైకాపాకు చెందిన మాజీ మంత్రి నాగార్జున విషయంలో టిడిపి నేతలు అతనితో కుమ్మక్కు అయ్యారని ప్రచారం సాగుతోంది. ఓ మహిళ తనను నాగార్జున మభ్యపెట్టి లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు గుప్పించింది. దీనిపై గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగింది. అయితే..నిన్న కోర్టులో సదరు మహిళ తాను మాజీ మంత్రి నాగార్జునపై చేసిన ఆరోపణలు నిజం కావని హైకోర్టులో పిటీషన్ వేసింది. అయితే గౌరవ హైకోర్టు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయడం, తరువాత కాదని చెప్పడమేమిటని నిలదీసింది. అయితే..ఈ కేసులో మాజీ మంత్రిని అరెస్టు చేయవద్దని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టును కోరగా..అందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు ఈ కేసులో నాగార్జునను అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. కానీ..పోలీసులు మాత్రం ఆయన జోలికి వెళ్లడం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతోందన్నదానిపై ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి.
నోవాటెల్ హోటల్‌లో సంప్రదింపులు...!
నాగార్జునపై మహిళ ఆరోపణలు చేసిన తరువాత నాగార్జున టిడిపి నాయకుల శరుణుకోరినట్లు తెలుస్తోంది. సదరు మాజీ మంత్రికి టిడిపి మాజీ మంత్రి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మేరుగ నాగార్జునను రక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారట. అంతే కాదు..ఈ కేసు విషయంలో రాష్ట్రానికి చెందిన ఓ కేంద్రమంత్రితో నాగార్జునను కలిపించారట. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో నాగార్జున రెండురోజుల పాటు కేంద్రమంత్రితో సంప్రదింపులు జరిపారట. తనను ఈ కేసు నుంచికాపాడితే..తాను టిడిపిలో చేరతానని ఆయన రాయబారాలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీనికి టిడిపి మాజీ మంత్రి మధ్యవర్తిత్వం చేశారని తెలుస్తోంది.ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఒకే నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు పలుసార్లు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నా ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఉందట. ఒకరు మంత్రి అయినప్పుడు...మరొకరికి సహాయం చేశారట. మంత్రిగా ఉన్న వ్యక్తి రెండో వ్యక్తికి సంబంధించిన మంచిచెడ్డలు, ఖర్చులు భరించేవారట. ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినా..వారి మధ్య ఉన్న సఖ్యతతో..ఇప్పుడు..అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు..నాగార్జునను కాపాడుతున్నారట.
కేవలం ఈ ఇద్దరే కాదు..టిడిపి రాష్ట్ర పార్టీ నాయకులు కూడా నాగార్జున విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నారట. ఒక మహిళ వైకాపాకు చెందిన మాజీ మంత్రిపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేస్తే..రాష్ట్ర టిడిపి కనీసం ప్రెస్‌మీట్ పెట్టలేదంటే..ఈ విషయంలో వారు..ఎలా మాజీ మంత్రితో కుమ్మక్కు అయ్యారో తేలిపోతుంది. చిన్న చిన్న విషయాలకే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లు పెట్టే నాయకులు..మాజీ మంత్రిపై ఓ మహిళ అంత తీవ్ర ఆరోపణలు చేస్తే..దాన్ని కనీసం ఖండించలేదంటే..సదరు మాజీ మంత్రి నాగార్జునతో టిడిపి నాయకులు ఎలా కుమ్మక్కు అయ్యారో..అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే..ఆయనను తన్నుతానని ఇదే నాగార్జున తన సీటు నుంచి ముందుకు పరిగెత్తుకువచ్చారు. స్పీకర్ వారించడంతో..అక్కడ నుంచి చంద్రబాబును బూతులు తిడుతూ..వెనక్కు వెళ్లారు. అటువంటి నేతను ఇప్పుడు టిడిపి నాయకులు కాపాడుతున్నారట. మొత్తం మీద..మేరుగ నాగార్జున తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా..టిడిపి అండతో...సురక్షితంగా బయటకు వస్తున్నారట. అయితే..ఈ మొత్తం వ్యవహారంలో..హైకోర్టు వ్యవహరించిన తీరు ఆయనకు ఆందోళన కల్గిస్తోంది. నేరారోపణ చేసిన వ్యక్తి తన ఆరోపణలను వెనక్కు తీసుకుంటానని చెపితే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ మహిళ ఇలానే లైంగిక ఆరోపణలు చేసింది. తరువాత ఆమె తన ఆరోపణలు వెనక్కు తీసుకుంటున్నానని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే కోర్టు దానికి అనుమతి ఇచ్చి ఆయనపై కేసును కొట్టివేసింది. అలాంటి సౌలభ్యమే మేరుగకు లభిస్తుందనుకుంటే..హైకోర్టు దాన్ని పడనీయలేదు. మొత్తం మీద..నాగార్జున టిడిపి నేతలకు బాగానే వలవేశారని, టిడిపిలో చేరతాననే హామీతో పాటు..నియోజకవర్గ నాయకుడిగా భారీగా ముట్టచెప్పారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కుమ్మక్కు వ్యవహారాలను పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు చూస్తూ ఉంటారా..? లేక ఏమైనా చర్యలు తీసుకుంటారో..చూడాలి మరి.