లైంగికదాడి ఖరీదు కోటి: సెటిల్‌చేసిన మాజీ సలహాదారు
దాంతోపాటు తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి
అధినేత రాకముందే సెటిల్‌మెంట్
రంగంలోకి వచ్చిన పల్నాటి మాజీ ఎమ్మెల్యే
మచిలీపట్నం నేతతోనూ సంప్రదింపులు
వైకాపా పార్టీలో సంచలనం సృష్టించిన లైంగికదాడి కేసును మాజీ సలహాదారు సెటిల్‌మెంట్ చేశారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత నుంచి లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన మహిళకు కోటి రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరిందని అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. తనపై వైకాపాకు చెందిన నేత లైంగికదాడి చేసినట్లు వారం రోజుల క్రితం ఓ మహిళ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఆ నేత అరెస్టు అవుతారేమోననే భయంతో టిడిపి నేతలతో మంతనాలు సాగించారు. వారి నుంచి హామీ వచ్చిన తరువాత స్వంత పార్టీ నేతలతో సదరు మహిళతో సెటిల్‌మెంట్ చేసుకున్నారట. ఈ సెటిల్‌మెంట్ ప్రకారం సదరు మహిళకు కోటి రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. అయితే..ఈ మహిళను నడిపించే వ్యక్తి దీనికి అంగీకరించలేదట. ఈ మొత్తం వ్యవహారంలో అతనే కీలకమైన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. మహిళలను పలువిధాలుగా అతను వాడుకుంటున్నాడని, అతని వల్లే సదరు మహిళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత వద్దకు చేరిందంటున్నారు. కొన్నాళ్లు వ్యవహారం సరిగానే జరిగిందని, అయితే..ఆ మహిళ వెనుక ఉన్న వ్యక్తికి సదరు నేతకు చెడడంతో..ఆ మహిళతో టిడిపి కార్యాలయంలో ఫిర్యాదు చేయించారట. దీంతో..సదరు నేత బెంబేలు పడిపోయి..వైకాపా మాజీ సలహాదారు శరణుచొచ్చారట. దీంతో మాజీ సలహాదారు..సదరు మహిళ వెనుక ఉన్న వ్యక్తిని పిలిపించి మాట్లాడారట. ఆమెతో కేసును వెనక్కు తీసుకోవాలని కోరగా, అతను తిరస్కరించాడని తెలిసింది. దీంతో ఎప్పుడూ వార్తల్లో ఉండే మచిలీపట్నం నేతను రంగంలోకి దించారట. అయితే..ఆయనతోనూ పనికాలేదట. ఇక తాను చెబితే..ఆ వ్యక్తి ఇక వినడని, పల్నాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యేను సలహాదారు రంగంలోకి దించారు. ఈ పల్నాడు మాజీ ఎమ్మెల్యేకు, మహిళ వెనుక ఉన్న వ్యక్తికి మంచి సాన్నిహిత్యం ఉందట. దాంతో..అతను రంగంలోకి దిగి...ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేతను బండబూతులు తిట్టాడట. అయిందేదో..అయింది...రాజీ చేయాలని పల్నాడు నేత కాళ్లు పట్టుకున్నారట. దాంతో..పల్నాడు నేత ఆ మహిళకు కోటి రూపాయలు, సదరు మహిళ వెనుక ఉన్న వ్యక్తికి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారట. దాంతో సంతృప్తి చెందిన సదరు మహిళ, ఆమెను నడిపించే వ్యక్తి కేసును ఉపసంహరించుకుంటున్నామని పిటీషన్ దాఖలు చేశారు. అయితే..ఇప్పుడు కోర్టు దాన్ని ఆమోదించకపోవడంతో..ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. తమ అధినేత బెంగుళూరు నుంచిరాక ముందే ఈ కేసును పరిష్కరించి ఆయన ముందు మార్కులు కొట్టేయాలని మాజీ సలహాదారు తెగ ఉబలాట పడ్డారట. అయితే..కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో..మిన్నకుండిపోయారని ప్రచారం జరుగుతోంది.
అయితే..ఇంత జరుగుతున్నా..అధికార టిడిపి పార్టీ మాత్రం దీనిపై నోరెత్తడం లేదు. ఎందుకంటే సదరు లైంగిన దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత తాను టిడిపిలోకి వస్తానని, తనతో పాటు మరికొందరిని కూడా తెస్తానని పార్టీకి రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన నాయకుడికి హామీ ఇచ్చారట. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన సదరు నేత...దీనితో సంతోషపడుతున్నారట. అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, విశ్వాసం లేని వ్యక్తిని పార్టీలోకి ఎందుకని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నా..సదరు నేత ఆయనపై సదాభిప్రాయంతో ఉన్నారట. మొత్తం మీద లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు అన్నీ కలిసివస్తున్నాయని, ఈ కేసులోంచి బయటకు వచ్చిన వెంటనే..ఆయన టిడిపి జెండా కప్పుకుంటారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. అయితే..నిన్నటి వరకూ అధినేత వీరుడూ,శూరుడూ అని పొగిడిన ఈ నేత..ఇప్పుడు ఆయనకు జెల్ల కొట్టి టిడిపి జెండా ఎత్తబోతున్నారని, ఆయన వల్ల కనీసం రెండు మూడు వందల కోట్లు సంపాదించుకున్న ఈ నేత తమ అధినేతకు ద్రోహం చేస్తున్నారని వైకాపాను అభిమానించే నేతలు చెబుతున్నారు. తమ అధినేత నమ్మకంగా, కష్టపడే నేతలకు పెద్దగా ఏమీ చేయరని, ఇలాంటి ఊసరవెల్లులకు వందలకోట్లు దారబోశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.