రిటైర్డ్ OSDలకు ఉద్వాసన
సర్వీస్ నుంచి రిటైర్ అయినా..నిబంధనలకు విరుద్ధంగా ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్న ఇద్దరు రిటైర్డ్ OSDలకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోన్న రిటైర్డ్ OSD ఎంవిఎస్ ఎస్ఎన్.మూర్తి, జలవనరులశాఖలో పనిచేస్తోన్న కె.రామ్మోహన్‌రావులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వీరిద్దరూ రిటైర్ అయినా ఆయాశాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే..వీరిని కొనసాగించాలని ఆయాశాఖల ప్రధాన కార్యదర్శులు పట్టుపట్టారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవడం ఆలస్యం అయింది. ఎట్టకేలకు వారిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. జలవనరులశాఖలో పనిచేస్తోన్న రామ్మోహన్‌రావు అదేశాఖలో 25 ఏళ్ల నుండి పనిచేస్తున్నారు. ఆయన సర్వీసు నుంచి రిటైర్డ్ అయిన తరువాత అక్కడే OSDగా నియమితులై నిరాటకంగా కొనసాగుతున్నారు. రిటైర్ అయిన తరువాత ఆయన దాదాపు ఆరు సంవత్సరాలపాటు అక్కడే పనిచేస్తున్నారు. ఆయన అలా కొనసాగడానికి, వివిధ దస్త్రాలపై సంతకాలు చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరో తెలియదు. ఇది నిబంధనలకు విరుద్దం కాగా ఆయనను కొనసాగించాలని ఆశాఖ కార్యదర్శి ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే వారిని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి, దానిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెవిన్యూశాఖలోని మూర్తి విషయం కూడా దాదాపు ఇంతే. తొలగించిన ఈ ఇద్దరు ఓఏస్‌డిలను ప్రభుత్వం మళ్లీ తీసుకుంటుందో లేదో చూడాలి మరి.