అసెంబ్లీలో చీఫ్ విప్‍గా జీవీ ఆంజనేయులు
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు క్యాబినెట్ ర్యాంక్ లభించింది. ఆయనను శాసనసభా చీఫ్ విప్‌గా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. వినుకొండ నుంచి గత ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించారు. మూడు సార్లు వినుకొండ నుంచి గెలిచిన ఆయనకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆయన అభిమానులు, వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఆశించారు. అయితే..ఆయనకు మంత్రి పదవి లభించలేదు. కాగా..ఆయనను ప్రభుత్వం చీఫ్ విప్‌గా నియమించింది. వెనుకబడిన పల్నాడు జిల్లాలోని వినుకొండ నుంచి ఆయన మూడు సార్లు గెలుపొందారు. 2009, 2014ల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2019లో ఓడిపోయినా..మొన్నటి ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించారు. వెనుకబడిన వినుకొండ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన తొలి రాజకీయనాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇక్కడ ఎవరూ మూడుసార్లు విజయం సాధించలేదు. కమ్యూనిస్టుపార్టీలకు గట్టిపట్టున్న ఈ నియోజకవర్గం...టిడిపి ఆవిర్భావం తరువాత టిడిపికి మంచి విజయాలను చేకూర్చిపెట్టింది. ముఖ్యంగా ఆంజనేయులు ఇక్కడకు వచ్చిన తరువాత పార్టీ ఇక్కడ గట్టిపట్టు సాధించింది. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితునిగా జీవీకి పేరుంది. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో..ఆయనకు చీఫ్ విప్ పదవిని ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వినుకొండ నుంచి గెలుపొందిన నన్నపునేని రాజకుమారి కాంగ్రెస్ ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవిని నిర్వహించారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎన్.జనార్ధన్‌రెడ్డి, చెన్నారెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆమె చీఫ్ విప్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ విప్ పదవిని నిర్వహించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా వినుకొండ నుంచి గెలుపొందిన జీవీకి కూడా చీఫ్‌విప్ పదవి లభించడం విశేషం. టిడిపి విజయం సాధించిన ప్రతిసారీ వినుకొండ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కుతుదనుకుంటే..చీఫ్‌విప్ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.