అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా RRR
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసింది. గత ఎన్నికల్లో ఉండి నుంచి రఘురామకృష్ణంరాజు గెలుపొందారు. అప్పట్లో ఆయనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భావించారు. అయితే...కొన్ని కారణాలవల్ల ఆయనకు చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వలేదు. దీనిపై ప్రజల్లోనూ, రాజకీయపార్టీల్లో నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. తనకు పదవి ఇవ్వకపోవడంపై రఘురామకృష్ణంరాజు పరోక్షంగా చంద్రబాబుపై, ఆయన తనయుడు లోకేష్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజు అప్పటి ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై తిరుగులేని పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా తరుపున ఎంపిగా గెలిచిన రఘురామకృష్ణంరాజు జగన్ అరాచకాలపై ప్రశ్నించడంతో ఆయనను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారు. ఒక ఎంపిపై అప్పటి ప్రభుత్వం చేసిన దాష్టికం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనను చిత్రహింసలకు గురిచేసిన జగన్‌పై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. రోజూ రచ్చబండ పేరిట ఆయన చేసిన విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. అసలు జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పోరాటం చేసిన తొలి వ్యక్తి రఘురామకృష్ణంరాజు అనడంలో ఎటువంటి సందేహం లేదు. టిడిపి,జనసేన నాయకులు జగన్‌కు భయపడి బయటకు రాని పరిస్థితుల్లో పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురైనా..ఆయన వెరవకుండా..మొండిధైర్యంతో జగన్‌ను ఢీకొట్టారు. జగన్‌ను ఓడించేందుకు టిడిపి,జనసేన,బిజెపిలు కూటమి కావాలని ఆయన మొదటి నుంచి కోరుకున్నారు. కూటమి కోసం ఆయన తనదైన ప్రయత్నాలను చేశారు. అయితే..కూటమి ఏర్పాటు అయిన తరువాత..ఆయనకే టిక్కెట్ లేకుండా పోవడంతో..టిడిపి అధినేత చంద్రబాబు ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో రఘురామకృష్ణంరాజు..అసంతృప్తితోనే ఎన్నికల్లో పోటీచేశారు. కూటమి గెలుపొందిన తరువాత..తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు.అయితే చంద్రబాబు లెక్కల వల్ల ఆయనకు మంత్రి పదవి రాలేదు. కాగా గత నాలుగైదు నెలల నుంచి రఘురామకృష్ణంరాజు..పరోక్షంగా చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసందర్భంలో తాను చేసిన పోరాటాలను ఆయన చెప్పుకుంటున్నారు. కాగా చిన్నచిన్న పదవులను తాను తీసుకోనని ఆయన పలు మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనను డిప్యూటీ స్పీకర్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఆయన తృప్తి పడతారా..? లేదో చూడాలి.