నారా రామ్మూర్తినాయుడు విఫల రాజకీయవేత్తా...!?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు మృతి తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటి తరానికి చంద్రబాబునాయుడుకు ఓ సోదరుడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. చంద్రబాబునాయుడు బంధువులు అంటే ఎన్టీఆర్ కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లే ఉంటుంది. చంద్రబాబు తరుపు బంధువులు ఎవరూ పెద్దగా బయటకనిపించేవారు కాదు. ప్రతి ఏడాది చంద్రబాబు సంక్రాంతి నాడు తన స్వంత గ్రామానికి వెళ్లి బంధువులతో కనీసం రెండురోజుల పాటు గడుపుతారు. ఆయన స్వంత ఊరు నారావారిపల్లెల్లో గడపగడపకు వెళ్లి బంధువులతో పాటు, గ్రామస్థులను కుశల సమాచారాన్ని తెలుసుకుంటారు. అయితే రాజకీయంగా కానీ, మరే ఇతర విషయాల్లో కానీ ఆయన తరుపు వారు ఎప్పుడూ బయట కనిపించిన దాఖలాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, రాష్ట్ర విభజన తరువాత కానీ..గత ముప్పయి సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నారు. కానీ..ఆయన బంధువులమంటూనో..లేక ఆయన ఊరివారమనో..ఎవరు కూడా ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
చంద్రబాబు తన బంధువులను రాజకీయాలకు దూరంగా ఉంచారంటారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ..ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు మాత్రం రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారు. ఇందుకు కారణాలు ఏమిటో తెలియదు. రామ్మూర్తినాయుడు 1994 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత జరిగిన 1999 ఎన్నికల్లో ఆయన కేవలం రెండువేల ఓట్లతో మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై ఓటమిచెందారు. ఇక అక్కడ నుంచి ఆయన రాజకీయ జీవితం దాదాపుగా ముగిసిపోయింది. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. తన సోదరుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాజకీయంగా చంద్రబాబు తనకు సహకరించలేదని, 1994లో కూడా తనకు ఎన్టీఆరే టిక్కెట్ ఇచ్చారని, స్వంత సోదరుడు ఏమీ చేయలేదని ఆరోపించారు. అప్పట్లో నారా రామ్మూర్తినాయుడు విమర్శలు సంచలనం సృష్టించాయి. అయితే..కాంగ్రెస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. ఇక అక్కడ నుంచి రాజకీయాల్లో ఆయన ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆయన పేరు కూడా ఎవరూ తలచుకోలేదు.
స్వంత సోదరుడు రెండు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నా రామ్మూర్తినాయుడు పేరు ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన ఒంటరి జీవితానికే పరిమితమయ్యారు. ఆయనతో చంద్రబాబు పరిశ్రమలు పెట్టించారని, అయితే..వాటిలోనూ ఆయన రాణించలేకపోయారంటారు. నిజమేమిటే వారికే తెలియాలి. అయితే..రామ్మూర్తినాయుడు గురించి 2019 ఎన్నికలకు ముందు జూ.ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు కొన్ని సంగతలు చెప్పారు. రామ్మూర్తినాయుడును చంద్రబాబు బంధించారని, ఆయనను గొలుసులతో కట్టేశారని అప్పట్లో సంచలన విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలను నారా రామ్మూర్తినాయుడు తనయుడు, సినీనటుడు నారా రోహిత్ ఖండించారు. చంద్రబాబు నారావారిపల్లె వెళ్లినప్పుడు తమ్ముడితో గడుపుతారని, ఆయన ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెబుతారు. అయితే ఇవన్నీ ఎప్పుడూ బయటకు రాలేదు. తమ్ముడు కుమారుడు రోహిత్‌కు నటనపై శ్రద్ధ ఉండడంతో..ఆయన హీరోగా నిలదొక్కుకోవడానికి సహాయం చేశారని చెబుతారు. అదే విధంగా ఆయన కుటుంబ విషయాలపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఇటీవల రోహిత్ వివాహ నిశ్చతార్ధానికి ఆమే ముందుండి జరిపించారు. సోదరుడు దేశ, తెలుగు రాష్ట్రా రాజకీయాలను శాసిస్తున్నా...తమ్ముడు మాత్రం పేరు, ప్రఖ్యాతులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. మొత్తం మీద..చంద్రబాబు తమ్ముడనే పేరుతో రామ్మూర్తినాయుడు తనువు చాలించాల్సి వచ్చింది.