పివి రమేష్ చెప్పేవి అసత్యాలు...!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చెప్పేవాటిలో కొన్ని అసత్యాలు ఉన్నాయని, తాను మరికొందరు కలసి చంద్రబాబుపై కుట్రచేసి స్కిల్ కేసు పెట్టామనేది అసత్యమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్ర వివరణ ఇచ్చారు. ఈ విషయంపై సతీష్‌చంద్ర Janamonline.comతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రవీణ్ ప్రకాష్, తాను మరికొందరు ఐఏఎస్ అధికారులతో కలిసి కుట్రచేసి చంద్రబాబును స్కిల్ కేసులో ఇరికించామనేది పచ్చి అబద్దమని ఆయన స్పష్టం చేశారు.
స్కిల్ కార్యదర్శిగా మూడు రోజులే ఉన్నా...!
అసలు తాను స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా పనిచేసిందే మూడు రోజులని, నవంబర్ 6, 2019లో తనకు స్కిల్‌డెవలప్‌మెంట్ సెక్రటరీ ఇన్‌ఛార్జి పోస్టు ఇచ్చారని, తాను 6వ తేదీన బాధ్యతలు చేపట్టానని, 7,8 తేదీలు వరుసగా బుధ,గురువారమని, తరువాత 9వ తేదీ అంటే శుక్రవారం నాడు మరో ఐఏఎస్ అధికారి అనంతరాముకు ఆ బాధ్యతలు అప్పచెప్పారని, ఇంతలోనే..తాను చేసిందేముంటుందని ఆయన ప్రశ్నించారు. 20వ తేదీన తన కుమారుడి వివాహం ఉన్నందున తాను ఆ హడావుడిలోనే ఉన్నానని, తనకు సంబంధం లేని విషయంలో తన పేరును రమేష్ ఎందుకు తీసుకువస్తున్నాడో..తనకు అర్థం కావడం లేదని సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పివి రమేష్‌తో తాను స్కిల్ కు సంబంధించిన విషయాలు ఎందుకు చర్చిస్తానని సతీష్ చంద్ర ప్రశ్నించారు. అసలు పివిరమేష్‌తో ఈ సబ్జెట్ ఎప్పుడూ చర్చించలేదు. అటువంటప్పుడు ఆయనతో చర్చ ఎందుకు వస్తుంది. ఒకవైపు స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు ఏమీ లేవని సంస్థకు ఎండిగా ఉన్న ఆర్జా శ్రీకాంత్ చెబుతున్నాడని ఆయనే చెబుతున్నారు. మరి అక్రమాలు లేవని శ్రీకాంత్ చెబుతున్నప్పుడు నేను అక్రమాలు ఉన్నాయని ఎలా చెబుతాను. సంస్థలో ఒకవేళ ఏమైనా అక్రమాలు, అవినీతి జరిగితే..కార్యదర్శిగా ఉన్న వ్యక్తికే ఎండి చెబుతారు కదా..? తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును రమేష్ ఎందుకు వాడుకుంటున్నాడో..తనకు తెలియదని సతీష్‌చంద్ర అన్నారు.
ఐదు నెలలు పోస్టింగ్ ఇవ్వలేదు
తాను నిజాయితీగా పనిచేసినా..తనపై టిడిపి ముద్ర వేసి జగన్ ఐదు నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదని సతీష్ చెప్పారు. వాస్తవానికి అప్పట్లో అందరికన్నా తానే సీనియర్ అధికారినని, తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వలేదని, తనకన్నా జూనియర్ అయిన అధికారికి సిఎస్ పోస్టు ఇచ్చారని ఆయన అన్నారు. అప్పట్లో జగన్ రిటైర్డ్ అయిన ఐఏఎస్‌లందరికీ సలహాదారు పదవులు ఇచ్చారని, తనకు మాత్రం ఇవ్వలేదంటేనే అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. చంద్రబాబుకు ద్రోహం చేసే ప్రసక్తేలేదని, ఆయనను ఇరికించాల్సిన అవసరం తనకు అసలే లేదని ఆయన స్పష్టం చేశారు.