వాలంటీర్లకు మంగళం: సరైన చర్యే...!?
రాష్ట్రంలో ఇకపై వాలంటీర్ వ్యవస్థ ఉండదు. ఈ మేరకు ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదని రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. కౌన్సిల్‌లో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం రెవిన్యువల్ చేయలేదని, దాంతో ఆ వ్యవస్థ రద్దనట్లేనన్నట్లు ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చామని, అయితే..ఆ వ్యవస్థే లేకపోతే వారిని ఎలా కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. వారికి జీతాలు ఇవ్వడానికి అవకాశం లేదని, ఇప్పటి వరకూ వారికి మే నెలవరకు జీతాలు చెల్లించామని ఆయన చెప్పారు. ఆగస్టు 2023 నాటికి వాలంటీర్ల వ్యవస్థ రద్దు అయిందని, అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం వారి గురించి పట్టించుకోలేదని, వారిని రెవిన్యువల్ చేయలేదని, అప్పట్లో వారు రెవిన్యువల్ చేసి ఉన్నట్లయితే..ఇప్పుడు తాము కొనసాగించేవారమని, అదే విధంగా తాము పెంచి ఇస్తామన్న జీతం కూడా ఇచ్చేవారమని, కానీ ఇప్పుడు ఆ వ్యవస్థేలేదని ఆయన స్పష్టం చేశారు.
ఉత్పాతకత లేని వ్యవస్థ...!
గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాలను అందించడానికని ఆయన భారీ ఎత్తున తన పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నారు. దాదాపు నాలుగు లక్షల మంది వాలంటీర్లను ఆయన నియమించుకుని పార్టీ పనిచేయించుకున్నారు. అయితే..ఎన్నికల ముందు చాలా మందితో ఆయన బలవంతంగా రాజీనామా చేయించారు. అప్పట్లో ఎన్నికల కమీషన్ నుంచి వ్యక్తమైన అభ్యంతరాలతో వారితో ఆయన ఆ విధంగా చేయించారు. అయితే కొంత మంది మాత్రం ఆయన మాటలను నమ్మకుండా రాజీనామా చేయకుండా ఉన్నారు. ఎన్నికల సమయంలో వీరి వ్యవహారంపై అటువైకాపా, ఇటు టిడిపి ఎత్తుకుపైఎత్తులు వేస్తూ రాజకీయం చేశారు. తాము అధికారంలోకి వస్తే..వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో ఆయన పార్టీ గెలిచినా..వాలంటీర్ల గురించి ఆయనేమీ ప్రస్తావించడం లేదు. అప్పట్లో వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని, సంక్షేమపథకాలు ఇవ్వలేమని జగన్ ఊదరగొట్టారు. అయితే..వారు లేకుండానే కూటమి ప్రభుత్వం ఆయా పనులను అప్పటి కన్నా మెరుగ్గా చేస్తోంది. దీంతో..ఇప్పుడు వాలంటీర్ల అవసరం లేకుండా పోయింది. కాగా ప్రజల్లో కూడా వారిపై సదాభిప్రాయం లేదు. ఎందుకు ఇంతమందిని ఊరికే కూర్చోబెట్టి పోషించడం అనే మాట వారిని వ్యక్తం అవుతోంది. కేవలం ఫించన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు ఇన్ని లక్షల మంది అవసరమా..? అనే ప్రశ్న మొదటి నుంచీ ఉన్నది. అయితే..అప్పట్లో జగన్‌కు భయపడి ఎవరూ నోరెత్తలేదు. అయితే..ఇప్పుడు జగన్ ఓటమి చెందిన తరువాత... వాలంటీర్లపై బహిరంగంగా ప్రజలు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వారి వల్ల ఉత్పాతకతేమీ పెరగదని, వారివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం తప్ప లాభమేమిలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయమే తీసుకోవాలి. వారిని తొలగిస్తే..ప్రజల నుంచి హర్హాతిరేకాలు వ్యక్తం అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. విమర్శలకు భయపడి చంద్రబాబు ఎటువంటి ఉత్పాతకత లేని అనవసర వ్యవస్థను కొనసాగించడం దండగమారి పనే.