వెటరన్/ఫ్రీలాన్సర్ అక్రిడిటేషన్ల పేరిట దోపిడీ...!
జగన్ ప్రభుత్వంలో దోపిడీకి..అంతేలేకుండా పోయింది. ఇందుగలడందు లేడన్నట్లు ఎక్కడ దొరికితే..అక్కడ జగన్ తో పాటు ఆయన మందిమాగాధులు హద్దేలేకుండా దోచుకున్నారు. చివరకు వీరు మీడియాను కూడా వదలలేదు. ప్రకటనల రూపంలో సాక్షికి వందలకోట్లు కట్టబెట్టుకోవడంతో పాటు..తమ పార్టీ కార్యకర్తలకు అక్రిడిటేషన్లు మంజూరు చేయించుకున్నారు. ఈ అక్రిడిటేషన్ల మంజూరులో కూడా సొమ్ములు చేతులు మారాయనేది బహిరంగ రహస్యమే. గతంలో ఉన్న విధానాలను తోసిరాజని, తమ ఇష్టారాజ్యంగా నిబంధనలను రూపొందించుకుని, తమకు కావాల్సిన వారికి అక్రిడిటేషన్లు కట్టబెట్టారు. ముఖ్యంగా వెటరన్/ /ఫ్రీలాన్సర్ పేరిట గతంలో ఎప్పుడూ లేని విధంగా దోపిడికి తెరతీశారు. వాస్తవానికి గతంలో వెటరన్/ /ఫ్రీలాన్సర్ జర్నలిస్టులుగా రాష్ట్రస్థాయిలోనే అక్రిడిటేషన్లు మంజూరు చేసేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాస్థాయిలోనూ వెటరన్/ /ఫ్రీలాన్సర్ భారీగా అక్రిడిటేషన్లు ఇచ్చారు. రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్‌గా జగన్ మద్దతుదారు విజయ్‌కుమార్‌రెడ్డి వచ్చిన తరువాత అడ్డగోలు జీవీలు తెచ్చారు. నిజమైన పాత్రికేయులకు అక్రిడిటేషన్లులో భారీగా కోత విధించిన విజయ్‌కుమార్‌రెడ్డి వైకాపా కార్యకర్తలకు, సొమ్ములు చెల్లించిన వారికి, తమకు ఇష్టం వచ్చిన వారికి మాత్రం ఇష్టారాజ్యంగా అక్రిడిటేషన్లు మంజూరు చేశారు.
వెటరన్/ ఫ్రీలాన్సర్ గా ఎవరు అర్హులు..?
వాస్తవాని వెటరన్/ /ఫ్రీలాన్సర్ జర్నలిస్టులుగా గతంలో పనిచేసిన సీనియర్ పాత్రికేయులకు ఇవ్వాలని గత ప్రభుత్వాలు జీవో జారీ చేశాయి. గతంలో పేరెన్నికన్న జర్నలిస్టులకూ అదీ రాష్ట్ర స్థాయిలో మాత్రం పరిమితంగా మహా అయితే 20 నుంచి 40 వరకూ ఇచ్చేవారు. అదీ ఎటువంటి వారికంటే..ఏ.బీ.కె ప్రసాద్, వరదాచారి, రంగాచారి, కుటుంబరావు వంటి మహామహులకు వంటి జర్నలిస్టులకే వెటరన్/ /ఫ్రీలాన్సర్ పేరిట అక్రిడిటేషన్లు ఇచ్చేవారు. అప్పట్లో ఇలాంటి ఉద్దండులైన వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో వారి సేవలను వాడుకోవాలనే ఉద్దేశంతో జీవో నెం. 142, 20.11.2019లో తెచ్చారు. అయితే....జగన్ తాబేదారు విజయ్‌కుమార్‌రెడ్డి వచ్చిన తరువాత ఆ జీవోను రద్దు చేసి జీవో నెం. 38ను తెచ్చి గతంలో ఉన్న నిబంధనలను తొలగించారు. దీని ప్రకారం వెటరన్/ /ఫ్రీలాన్సర్ కింద ఇచ్చే అక్రిడిటేషన్లలో కనీసం జర్నలిస్టుగా 20ఏళ్లు పనిచేసి ఉండాలి. అదీ ప్రముఖ పత్రికలు/ మీడియం/ మ్యాగజైన్లలో కనీసం 12 క్లిపింగ్స్ ఉండాలనే నిబంధనను పెట్టారు. కానీ..దీన్ని అమలు చేయకుండా తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా మంజూరు చేసుకుంటూపోయారు. గతంలో ఇలాంటి అక్రిటిడేషన్లు మహా అయితే 40 వరకూ ఉండేవి కానీ..జగన్ ప్రభుత్వంలో కేవలం I&PRలోనే 200 మంది దాకా ఇచ్చేసుకున్నారు. ఇక అన్ని జిల్లాలు కలిపితే ఎన్ని ఉంటాయనేది లెక్కకు అందని అంచనా. రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లాస్థాయిలో కూడా వెటరన్/ /ఫ్రీలాన్సర్ పేరిట తమ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఇష్టారాజ్యంగా విజయ్‌కుమార్‌రెడ్డి పంచిపెట్టారు. ఈ పంపకాల్లో అప్పట్లో సమాచారశాఖలో అంతా తానై చక్రం తిప్పిన అధికారిదే కీలకపాత్ర. తనకు ఇష్టమైన వారికే ఆ అధికారి అక్రిడిటేషన్ మంజూరు చేసేవారు. లేదంటే..ఇక అంతే..? జిల్లాలోనూ..ఆ అధికారి చెప్పినవారికే అక్రిడిటేషన్లు మంజూరు అయ్యాయని ఇప్పుడు కథకథలుగా చెప్పుకుంటున్నారు. కాగా..జగన్ పాలనాకాలం చివరల్లో జర్నలిస్టులకు స్థలాలు మంజూరుచేస్తామని ఓ ఉత్తిత్తి జీవోను విడుదల చేశారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని జర్నలిస్టులకు స్థలాలు వస్తున్నాయంటూ..భారీగా అక్రిడిటేషన్లు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా.. గత ప్రభుత్వ హయాంలో వెటరన్/ /ఫ్రీలాన్సర్ పేరిట జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.