అదాని,జగన్ లంచాలపై...నోరెత్తని వైకాపా...!?
ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని లంచాల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారతదేశంలో రెవిన్యుబుల్ ఎనర్జీ ఉత్పత్తి కోసం వివిధ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్న సమయంలో..ఆయా రాష్ట్రాల్లోని పాలకులకు లంచాలు ఇచ్చారనే అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో లంచాలపై కేసు నమోదు అయింది. ముఖ్యంగా అప్పట్లో ఒప్పందాలు జరిగినప్పుడు ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి భారీగా లంచాలు ముట్టినట్లు అమెరికా ప్రాసిక్యూషన్ చెబుతోంది. తూతూ మంత్రంగా ఒప్పందాలు చేసుకుని, పేపర్‌పై సంస్థలను సృష్టించి వాటి ద్వారా భారీగా ఆదాయం వస్తుందని అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి రుణాలను అదాని సంస్థలు సేకరించాయి. దీనిపై అనుమానం వచ్చిన అమెరికా సంస్థలు ఫిర్యాదు చేయడంతో ఈ లంచాల వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై ఈ రోజు ఉదయం నుంచి జాతీయ మీడియాతో పాటు, ప్రాంతీయ మీడియా, సోషల్‌మీడియా, ఇతర మీడియాలు హోరెత్తిస్తున్నాయి. అదాని నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భారీగా లంచాలు తీసుకున్నారని, మొత్తం 2000కోట్లు లంచాల రూపంలో పంచితే...దానిలో మూడో వంతు ఆంధ్రాలోనే పంచారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయవర్గాలు పెద్దగా స్పందించలేదు. అటు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ పార్టీ కానీ, ఇటు అధికారంలో ఉన్న కూటమి పెద్దలు కానీ ఇంకా దీనిపై స్పందించలేదు. అయినదానికి కాని దానికీ మీడియా ముందుకు వచ్చే వైకాపా నాయకులు..ఈ విషయంలో మాత్రం నోరెత్తడం లేదు. ఎందుకు వీరు మౌనం పాటిస్తున్నారో..అర్థం కావడంలేదు. మోడీకి దగ్గరైన అదాని గురించి మాట్లాడితే..ఆయనకు కోపం వస్తుందన్న భావనతో టిడిపి, జనసేన మాట్లాడలేదేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే..తమపై వస్తోన్న ఆరోపణలపై వైకాపా పార్టీలో ఎవరూ స్పందించడం లేదు. కనీసం పార్టీ మీడియా కూడా దీనిపై నోరెత్తడం లేదు. అంటే..వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారా..? లేక ఆధారాలతో దొరికిపోవడంతో..ఏమీ చేయని పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు. దాదాపు రూ.1600కోట్లు లంచాలు జగన్ ఇంటికి చేరాయనే వార్తలపై జగన్ మౌనాన్ని ఆశ్రయించడం విచిత్రంగా ఉంది. ఆయన తప్పులేకపోతే..ఎందుకు స్పందించరని వివిధ వర్గాలకు చెందిన వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఐదేళ్లు జగన్ చేసిన అరాచకాలు సాక్ష్యాధారాలతో లభ్యమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్‌పై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కపెట్టడం సరికాదని టిడిపి శ్రేయోభిలాసులు కోరుకుంటున్నారు.