లంచాల కేసులో...కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి...!?
లంచాలు ఇచ్చినోడు..బాగానే..ఉన్నాడు..తీసుకున్నోడు బాగానే ఉన్నాడు. నడి మధ్య ఉన్నోడు నలిగిపోతున్నాడు..అన్నట్లుంది..టిడిపి పరిస్థితి. పారిశ్రామికవేత్త అదానీ లంచాల వ్యవహారం టిడిపిపై ఒత్తిడి పెంచుతోంది. రూ.1600కోట్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లంచాల రూపంలో చెల్లించి, వాటి ద్వారా సౌరవిద్యుత్ ఒప్పందాలను సాధించారని, దీని ద్వారా అమెరికాలో ఫండ్ రైజ్ చేశారనే ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం అదానీపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రాలో దీని మూలాలు ఎక్కువ ఉండడంతో..ఇక్కడా దానిపై రసవత్తర చర్చ సాగుతోంది. జగన్ సంగతి అందరికీ తెలిసిందే కనుక..అమెరికా చేసిన ఆరోపణలు మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. సాక్ష్యాధారాలు లేకుండా అమెరికా వ్యవస్థలు ఆరోపణలు చేయమని, వారి ఆరోపణలను నమ్ముతున్నామనే వారే ఎక్కువగాఉన్నారు. అయితే..జగన్‌పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందోనన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే..నిన్న ఉదయం ఈ వార్త వచ్చినప్పటి నుంచి అధికార ఎన్‌డిఏ కూటమి అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అదే సమయంలో దీనిపై ఏమి చేయబోతోందో కూడా చెప్పడం లేదు.
దేశ, రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా..అధికార కూటమి ప్రభుత్వం మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తోంది. మరోవైపు నిన్న జగన్‌పై వచ్చిన వార్తలతో వైకాపాలో తీవ్ర నిర్వేదం, నిరుత్సాహం వ్యక్తం కాగా..ఈరోజు మాత్రం మళ్లీ తనకు అలవాటైన విధంగానే ఎదురుదాడి చేస్తోంది. అసలు అదానీతో తాము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని, తాము కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నామని, కేంద్రప్రభుత్వం లంచాలు ఇస్తుందా....? అని అమాయకంగా ప్రశ్నిస్తోంది. వాస్తవానికి కేంద్రంతో ఒప్పందం చేసుకున్నా..ఈ ఒప్పందం కుదరడానికే..అదానీ జగన్‌కు లంచాలు ఇచ్చారనేది అభియోగం. ఇదంతా చెప్పకుండా..అమాయకంగా వైకాపా ప్రశ్నలు వేస్తోంది. వారి అమాయకత్వం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే..ఇప్పుడు మరో ముందడుగు వేసి..ఒకవేళ ఒప్పందాల్లో అవినీతి జరిగితే..రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఒప్పందాలను రద్దు చేస్తామని, అదానీనీ అరెస్టు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టిడిపి ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అదానికీ వ్యతిరేకంగా ప్రకటన చేస్తే ప్రధాని మోడీతో చిక్కులు తప్పవు. అదే సమయంలో..ఈ ఒప్పందాలపై ఏమి మాట్లాడినా..ఇబ్బందులు వస్తాయనే భావన వారిలో ఉంది. ఒకవేళ ధైర్యం చేసి ఒప్పందాలను రద్దు చేస్తే..రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వాతావరణం లేదని, పారిశ్రామికవేత్తలను ప్రారదోలుతున్నారనే ప్రచారాన్ని వైకాపా ప్రారంభిస్తుంది. మరోవైపు జగన్ అవినీతి కళ్ల ముందు ఉన్నా చర్యలుతీసుకోలేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఈ ఒప్పందాలను రద్దు చేసి విచారణ జరిపిస్తే..టిడిపిపై నెలకొన్న ఒత్తిడి కొద్దిగానైనా తగ్గుతుంది. అదే విధంగీ సీఐడీతో జగన్‌పై విచారణ చేయించాలి. ఇక దీనిపై కేంద్రాన్ని ఈడీ దర్యాప్తు కోరాలి. అయితే..ఇవన్నీ జరుగుతాయా..? మోడీ దీనికి అంగీకరిస్తారా..? అదానీ కేసులో నిన్న ఉన్న వేడీ..ఈరోజు కనిపించడం లేదు. మొత్తం మీద..ఢిల్లీ పెద్దలు ఏమి చెబితే..దానికి అనుగుణంగా టిడిపి కూటమి పెద్దలు నడుస్తారనే అభిప్రాయం ఉంది. అయితే..తప్పుడు పనులు చేసి కూడా వైకాపా టిడిపి కూటమిపై ఎదురుదాడి చేస్తోంది.