జగన్ లంచాలపై అసెంబ్లీలో నామమాత్ర చర్చ...!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి లంచాల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. సౌరవిద్యుత్ ఒప్పందాల్లో అదానీ దాదాపు రూ.1600కోట్ల ముడుపులు జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. దీనిపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి జగన్‌ను ఎండగడతారని భావించగా అలాంటిదేమీ లేకుండా నామమాత్రంగా చర్చించి వదిలేశారు. మాట్లాడిన ఇద్దరు ముగ్గురు సభ్యులు కూడా అదానీని ఏమీ అనకుండా జగన్‌పై విమర్శలు చేశారు. ఎందుకుకూటమి ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు. జగన్ అవినీతి చరిత్రపై అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించాల్సింది. అతను ఏ విధంగా ప్రజల సొమ్ము దోచుకున్నాడు...? సౌరవిద్యుత్ ఒప్పందాల్లో ఎంత లంచాలు తిన్నాడో..? దీని వల్ల ప్రజలపై ఎంత భారం పడుతుందో వివరిస్తే...ప్రజలకు అతని నిజస్వరూపం మరోసారి తెలిసేది. రాబోయే 25 సంవత్సరాల్లో ప్రజలపై ఎంతభారం పడుతుందో..ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగడం ఎవరి పుణ్యమో ప్రజలకు సవివరంగా తెలిసిపోయేది. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు భారీగా వస్తున్నాయి. సర్దుబాటు పేరిట వస్తోన్న ఈ ఛార్జీలపై అప్పుడే వైకాపా నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి జగన్మోహన్‌రెడ్డే కారణమని, ఆయన తీసుకున్న లంచాలవల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని సభ సాక్షిగా నిరూపించాల్సింది. కానీ ఎందుకో కూటమి పెద్దలు ఈ విషయంపై సీరియస్‌గా లేరనే వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఆఖరు రోజు సభా సమయాన్ని పెంచి అయినా జగన్‌ను ఎండగట్టాల్సింది. ముందుగా నిర్ణయించిన విధంగానే అసెంబ్లీని నడిపారు. ఎందుకు ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని కూటమి పెద్దలు వదులుకున్నారనే దానిపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. జగన్‌ను ఎండగడితే..అదే సమయంలో అదాని విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుందనే భయమే దీనికి కారణమా..? అదాని విషయంలో మోడీ ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఎందుకు మనం తొందరపడాలి అనే భావమా..? అదానీ వ్యవహారంలో ఇంకేమైనా లోతు విషయాలు ఉన్నాయా..? ఇటీవలే అదానికి సంబంధించిన సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసివెళ్లారు. అప్పుడు రాష్ట్రంలో ఏమైనా పెట్టుబడులు పెడతరా..? అనే హామీ వారి నుంచి వచ్చిందా..? లేక ఇంకా బయటకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తంమీద..జగన్ అవినీతి, అరాచకాన్ని మరోసారి ప్రజలకు సాక్ష్యాలతో నిరూపించే అవకాశం దొరికినా కూటమి పెద్దలు వదిలేశారు.